‘కూడంకుళం’ జాతికి అంకితం

11 Aug, 2016 01:55 IST|Sakshi
‘కూడంకుళం’ జాతికి అంకితం

అణు విద్యుత్ ప్లాంట్‌లోని తొలి యూనిట్‌ను
అంకితం చేసిన మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, జయ
భారత్-రష్యా సంబంధాల్లో మైలురాయిగా అభివర్ణన
వెయ్యి మెగావాట్ల యూనిట్ గర్వకారణం: మోదీ

సాక్షి ప్రతినిధి, చెన్నై : భారత్.. రష్యా సాంకేతిక సహకారంతో తమిళనాడులో నిర్మించిన ప్రతిష్టాత్మక కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం(కేఎన్‌పీపీ) జాతికి అంకితమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, తమిళనాడు సీఎం జయలలితలు సంయుక్తంగా బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్లాంటులోని మొదటి యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. మోదీ ఢిల్లీ నుంచి, పుతిన్ మాస్కో నుంచి, జయ చెన్నైలోని సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యూనిట్ భారత్, రష్యాల సంబంధాల్లో మైలురాయి అని మోదీ, పుతిన్‌లు పేర్కొన్నారు. ఇదుదేశాల వ్యూహాత్మక, ప్రత్యేక భాగస్వామ్యానికి నిదర్శనమని కొనియాడారు. ప్లాంటు నిర్మాణంలో పాల్గొన్న శాస్త్రవేత్తలను మోదీ అభినందించారు. 

 అతిపెద్ద యూనిట్: మోదీ
వెయ్యి మెగావాట్ల సామర్థ్యమున్న ఈ యూనిట్ దేశ విద్యుత్ రంగంలో అతిపెద్ద యూనిట్ అని, స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిని భారీగా పెంచాలన్న భారత లక్ష్యాల్లో మైలురాయి అని మోదీ పేర్కొన్నారు. ఇందుకు భారతీయులు రష్యాకు రుణపడి ఉన్నారన్నారు. ‘ఒకేచోట వెయ్యిమెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే తొలి యూనిట్ ఇదే కావడం గర్వకారణం. కూడంకుళం-1తో భారత్-రష్యా సంబంధాల్లో మరో చారిత్రక ముందుడుగు వేశాం.

ఇది ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికే కాక, దృఢమైత్రికీ వేడుకలాంటిది. పారిశ్రామిక ప్రగతి స్వచ్ఛ ఇంధనంతో ముందుకు సాగాలి. అణు విద్యుత్ ఉత్పత్తి ఎజెండాను ముందుకు తీసుకెళ్తాం. రష్యా సహకారంలో కూడంకుళంలోనే ఇలాంటి మరో ఐదు భారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని తమిళంలో జయను ఉద్దేశించి చెప్పారు. భారత్-రష్యా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం శాశ్వతంగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు పుతిన్‌ను ఉద్దేశించి రష్యన్‌లో అన్నారు. 

 ఉన్నత ప్రమాణాలు: పుతిన్
అత్యాధునిక రష్యా సాంకేతిక పరిజ్ఞానం, ఉన్నతస్థాయి భద్రతా ప్రమాణాలతో ఈ యూనిట్‌ను నిర్మించినట్లు పుతిన్ చెప్పారు. కూడంకుళం ప్రాజెక్టు సాకారం కావడానికి  తాను సీఎంగా ఉన్న పదేళ్ల కాలంలో ఎల్లప్పుడూ మద్దతిచ్చానని జయ పేర్కొన్నారు. ప్రాజెక్టు భద్రతకు సంబంధించిన స్థానికుల భయాందోళనలు తొలగించేందుకు, వారికి నచ్చజెప్పేందుకు ప్రాధ్యాన్యమిచ్చానని ఆమె పేర్కొన్నారు. 

 ప్రాజెక్టు విశేషాలు..
కూడంకుళం ప్రాజెక్టు నిర్మాణం కోసం 1988లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ, సోవియట్ యూనియన్ అధ్యక్షుడు గోర్బచెవ్‌లు ఒప్పందంపై సంతకాలు చేశారు. అసలు కార్యాచరణ 1997లో మొదలైంది. భారత అణువిద్యుత్ కార్పొరేషన్, రష్యాకు చెందిన రోసాటమ్ సంస్థలు కేఎన్‌పీపీని నిర్మించాయి. శుద్ధి చేసిన యురేనియంతో పనిచేసే వీవీఈఆర్ రకం అణు రియాక్టర్లను ఇందులో నెలకొల్పారు. మొదటి, రెండో యూనిట్లను రూ. 21 వేల కోట్ల ఖర్చుతో నిర్మించారు. రెండో యూనిట్ ఈ ఏడాదిలోనే ఉత్పత్తి ప్రారంభించే అవకాశముంది. ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్‌లో అత్యధిక భాగం తమిళనాడు, మిగతా భాగం కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిలు పంచుకుంటాయి.

మరిన్ని వార్తలు