పార్టీ బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ

6 Feb, 2019 18:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ బుధవారం పార్టీ ప్రధాన కార్యలయంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రియాంకను పార్టీ ప్రధాన కార్యదర్శిగా, తూర్పు యూపీ ఇన్‌ఛార్జ్‌గా ఆమె సోదరుడు, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ జనవరి 23న నియమించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని అక్బర్‌ రోడ్‌ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్‌ చాంబర్‌ పక్కనే ప్రియాంక కార్యాలయం ఏర్పాటు చేశారు.

కాగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ప్రియాంక గురువారం తొలి అధికారిక సమావేశంలో పాల్గొంటారు. సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన వ్యూహాలను రూపొందించేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లతో జరిగే సమావేశానికి ప్రియాంక హాజరుకానున్నారు.


వాద్రాకు బాసట
మనీల్యాండరింగ్‌ కేసులో ఈడీ ఎదుట హాజరైన తన భర్త, వాణిజ్యవేత్త రాబర్ట్‌ వాద్రాకు ప్రియాంక సంఘీభావం తెలిపారు. కుటుంబానికి అండగా నిలుస్తానని స్పష్టం చేశారు. ఈడీ విచారణ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. వాద్రాను ఈడీ కార్యాలయం వద్ద డ్రాప్‌ చేసిన అనంతరం నేరుగా ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్న ప్రియాంక పార్టీ బాధ్యతలు స్వీకరించారు. కాగా వాద్రాకు ఈనెల 16 వరకూ మధ్యంతర బెయిల్‌ను ఢిల్లీ కోర్టు మంజూరు చేసింది.

మరిన్ని వార్తలు