మందిర్ పునర్నిర్మాణానికి డిమాండ్‌

22 Aug, 2019 21:34 IST|Sakshi

ఢిల్లీ  : దేశ రాజధానిలో రవిదాస్‌ మందిర్‌ కూల్చివేతకు నిరసనగా తుగ్లకాబాద్‌ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ఈనెల 10న ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (డీడీఏ) అధికారులు రవిదాస్‌ మందిర్‌ను కూలగొట్టిన విషయం తెలిసిందే. వేలాది దళితులు మందిర్‌ పునర్నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని అంబెద్కర్‌ భవన్‌ నుంచి రామ్‌లీలా మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. కూల్చివేతకు నిరసనగా బుధవారం ఆందోళనకారులు నిరసనల హోరు కొనసాగించారు. తమ జాతికి అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ ఆందోళనల నేపథ్యంలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారుభీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌, రాజేంద్ర పాల్‌ గౌతం సహా పలువురు మత పెద్దలు పాల్గొన్నారు. వీరితో  పాటు మరో 50మంది ఆందోళనకారులు పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ఆందోళనకారులకు, ప్రజలకు గాయాలయ్యానన్న వార్తలను పోలీసులు కొట్టి పారేశారు. ఈ ఘటన గురించి డీసీపీ చిన్మయ్‌ బిస్వల్‌ మాట్లాడుతూ రాత్రి 7.30ప్రాంతంలో రవిదాస్‌ మందిర్‌వైపు ఆందోళనకారులు సమూహంగా ఎర్పడ్డారు. కొద్ది సేపటికే నిరసనకారులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు రాళ్లవర్షం కురిపించారని డీసీపీ వెల్లడించారు.

ఈ ఆందోళనలో వివిధ రాష్ట్రాల ప్రజలు పాల్గొన్నారు. నగరంలో పలు ప్రదేశాలలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు నిరసనకారులకు పలు రకాలుగా సూచించినా వినకపోవడంతో అదుపులోకి తేవడానికి లాఠీచార్జ్‌ చేశారని అన్నారు. ​​​​​​​​​​​​​​​​​​గాయాల​కు పాల్పడినవారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులు కొన్ని వాహనాలను, రెండు మోటార్‌ సైకిళ్లను ద్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

కులతత్వాన్ని ప్రోత్స​హిస్తున్నారని యూపీ మాజీ సీఎం మాయావతి విరుచుకుపడ్డారు. అయితే, మాయావతి ఆరోపణలకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందిస్తూ ఈ అంశంలో తమ ప్రభుత్వం ఏమి చేయలేదని అన్నారు. ‍కేంద్రమే సరియైన నిర్ణయం తీసుకొని వేరే ప్రదేశంలో మందిర్‌ను నిర్మించడానికి చొరవ చూపాలని పట్టణశాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా