నోట్ల రద్దుపై నేడు నిరసనలు

28 Nov, 2016 01:20 IST|Sakshi
నోట్ల రద్దుపై నేడు నిరసనలు

భారత్ బంద్ కాదు: కాంగ్రెస్  
- ఆర్థికమంత్రిగా ఉండుంటే రాజీనామా చేసేవాణ్ని: చిదంబరం
 
 న్యూఢిల్లీ/చెన్నై: కేంద్రం తీసుకున్న రూ. 500, రూ. వెరుు్య నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా సోమవారం దేశవ్యాప్తంగా విపక్షాలు ‘జన్ ఆక్రోశ్ దినం’ పేరుతో నిరసనలను చేపడతున్నాయి. విపక్షాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయని గతంలో వార్తలు వచ్చినప్పటికీ..బంద్ కాదనీ, కేవలం నిరసనలేనని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ స్పష్టం చేసింది. తాము నిరసనలు చేపడుతుంటే, బీజేపీ వాటిని ‘భారత్ బంద్’ అంటూ ప్రజలను తప్పదోవ పట్టిస్తోందని ఆరోపించింది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సోమవారం నాటి నిరసనల్లో పాల్గొననున్నారుు. కాంగ్రెస్ మిత్రపక్షమైన జేడీయూ మాత్రం నోట్ల రద్దును సమర్థిస్తూ నిరసనలు చేపట్టడం లేదు. పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు సోమవారం బంద్‌కు పిలుపునిచ్చాయి.

 రాజకీయ లబ్ధి కోసమే: కాంగ్రెస్
  ‘నోట్ల రద్దు సరైన సన్నద్ధత లేకుండా రాజకీయ లబ్ధి కోసం తీసుకున్న నిర్ణయం’ అని, ‘నల్లధనానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్య’గా ఇది బాగా అమ్ముడవుతోందని కాంగ్రెస్ విమర్శించింది. ‘ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోడానికి 3 కారణాలు ఉన్నారుు. అవి 1.ప్రచారం 2.ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం 3. విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కు తీసుకురావడంలో విఫలమవ్వడం’ అని కాంగ్రెస్ ప్రతినిధి జైరాం రమేశ్ వివరించారు. అవసరమైనన్ని నోట్లను ముద్రించి చలామణిలోకి తీసుకురావడానికి 250 రోజుల దాకా పడుతుందన్నారు.

 వద్దని చెప్పే వాణ్ని: చిదంబరం
 మరో కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం మాట్లాడుతూ తానే గనుక ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుు్య ఉండి.. నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలు చేయాల్సిందేనంటూ ప్రధాన మంత్రి బలవంత పెడితే రాజీనామా చేసి ఉండేవాడినని అన్నారు. ‘నేను ఆర్థిక మంత్రిగా ఉండి..నోట్లను రద్దు చేసే నిర్ణయాన్ని ప్రధాని నాకు చెప్పి ఉంటే ఆయనకు సరైన లెక్కలు వివరించి ఈ నిర్ణయం అమలు చేయకూడదని సలహా ఇచ్చి ఉండే వాడిని. అరుునా అది తన నిర్ణయమనీ, అమలు చేయాల్సిందేనని ప్రధాని బలవంత పెడితే రాజీనామా చేసి ఉండే వాడిని’ అని చిదంబరం అన్నారు.

 ఎడారిలో పంట పండించడమే: ఏఐఏడీఎంకే
 దేశంలోని నల్ల ధనాన్ని ఏరివేయడానికి ప్రభుత్వం తీసుకున్న నోట్ల ఉపసంహరణ నిర్ణయం..అడుగున రంధ్రాలు పడిన బక్కెట్‌తో నీళ్లను తోడి ఎడారిలో పంట పండించాలనే చెత్త నిర్ణయం వంటిదని ఏఐఏడీఎంకే తీవ్రంగా విమర్శించింది. మరోవైపు నగదు రహిత లావాదేవీలకు ప్రజలు మళ్లాలన్న మోదీ సలహాను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తీవ్రంగా విమర్శించింది.

మరిన్ని వార్తలు