కరోనా: ఒక్కరి కారణంగా పంజాబ్‌లో 23 మంది..

27 Mar, 2020 13:08 IST|Sakshi

నిర్లక్ష్యం ఖరీదు ఒక మృతి, 23 పాజిటివ్‌ కేసులు!

చండీగఢ్‌: మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) విలయతాండవం చేస్తున్న వేళ ఓ వృద్ధుడి కారణంగా పంజాబ్‌లోని దాదాపు 15 గ్రామాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. విదేశాల్లో పర్యటించిన అతడు స్వదేశానికి వచ్చిన తర్వాత వందలాది మందిని కలవగా.. వారిలో 23 మందికి కరోనా సోకినట్లు వెల్లడైంది. రాష్ట్రంలో మొత్తం 33 కేసులు నమోదు కాగా అత్యధిక మందికి సదరు వ్యక్తి ద్వారానే ఈ మహమ్మారి సోకింది. వివరాలు... పంజాబ్‌కు చెందిన 70 ఏళ్ల వ్యక్తి ఓ గురుద్వార మతపెద్దగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన ఇద్దరు సన్నిహితులతో కలిసి కొన్ని రోజుల క్రితం జర్మనీ, ఇటలీ పర్యటనకు వెళ్లారు. రెండు వారాలు అక్కడే ఉండి.. మార్చి 6న స్వస్థలానికి వచ్చారు. (హోం క్వారంటైన్‌ వీడి.. స్వస్థలానికి ఐఏఎస్‌?!)

అనంతరం మార్చి 8-10 వరకు ఆనంద్‌పూర్‌ సాహిబ్‌ వద్ద జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత దాదాపు 15 గ్రామాల్లో పర్యటించి వందలాది మందిని కలిశారు. ఈ క్రమంలో మార్చి 18న కరోనా తీవ్రతరమవడంతో ఆయన మృతి చెందారు. అదే విధంగా ఆయన కుటుంబ సభ్యుల్లో దాదాపు 14 మందికి కరోనా అంటుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు సదరు వృద్ధుడిని కలిసిన వారందరి వద్దకు వెళ్లి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు. 15 గ్రామాల వ్యక్తులు విధిగా సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా నవన్షార్‌, మొహాలీ, అమృత్‌సర్‌, హోషియాపూర్‌, జలంధర్‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా భారత్‌లో ఇప్పటివరకు 700 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 17 మంది మృత్యువాతపడ్డారు.(లాక్‌డౌన్‌: సర్‌.. మీకిది కూడా తెలియదా?)

కరోనా నెగటివ్‌: అయ్యో పాపం...

మరిన్ని వార్తలు