పోలీస్‌ స్టేషన్‌లో కొత్త పెళ్లికూతురి నిర్వాకం

7 Jul, 2018 13:50 IST|Sakshi
పోలీస్‌ స్టేషన్‌లోనే డ్రగ్స్‌ సేవిస్తున్న నూతన వధువు

చండిఘడ్‌ : పంజాబ్‌ రాజకీయాలన్ని ఇప్పుడు డ్రగ్స్‌ చుట్టే తిరుగుతున్నాయి. ఓ వైపు అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో డ్రగ్స్‌ సమస్యను ఎదుర్కొనేందుకు నానా తంటాలు పడుతుంటే.. పోలీసులు మాత్రం మాకు ఇవేవి పట్టవన్నట్టు వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఫిరోజ్‌పూర్‌ డీఎస్పీ ఒక మహిళకు బలవంతంగా మత్తు పదార్ధాలు అలవాటు చేసిన సంగతి బయటకు రావడంతో మొత్తం పోలీస్‌ శాఖ మీదనే చెడు అభిప్రాయం ఏర్పడింది. ఈ నేపధ్యంలో పోలీసు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టే వీడియో మరొకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

ఈ వీడియోలో ఒక నవ వధువు ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లోనే కూర్చుని ‘చిట్టా’(హెరాయిన్‌ లాంటి మత్తు పదార్ధం) తాగుతుంది. వీడియోలో ఉన్న వివరాల ప్రకారం.. పెళ్లి దుస్తులు ధరించిన ఓ యువతి వెలుగుతున్న కొవ్వొత్తి ముందు కూర్చుని ఉంది. ఆ మంట మీద ‘చిట్టా’ ఉన్న ఫాయిల్‌ పేపర్‌ను పెట్టి దాన్ని తాగుతు ఉంది. యువతి పోలీస్‌ స్టేషన్‌లోనే ‘చిట్టా’ సేవిస్తుందనడానికి నిదర్శంగా అక్కడ ఉన్న కొవ్వొత్తి నలుపు రంగు ఇనుప పెట్టెలో ఉంది. ఈ ఇనుప పెట్టే సాధారణంగా ప్రతి పోలీస్‌ స్టేషన్‌లోనూ కనిపిస్తుంది. వీడియోలో ఒక వ్యక్తి గొంతు కూడా వినిపిస్తుంది. అతను ‘నేను జలందర్‌లో రైడ్‌ చేయడానికి వెళ్తున్నని’ అంటున్నాడు.

యువతి పోలీస్‌ స్టేషన్‌లోనే ఇంత దర్జాగా డ్రగ్స్‌ సేవిస్తుందంటే దీని వెనక కూడా పోలీసుల హస్తం ఉన్నదేమోననే అనుమానాలు రేకెత్తుతున్నాయి. స్థానికంగా ‘చిట్టా’ అని పిలిచే ఈ మత్తు పదార్ధంలో హెరాయిన్‌తో పాటు ఎల్‌ఎస్‌డీ కూడా కలిసి ఉండి ఎక్కువ మత్తు కల్గిస్తుంది. గతంలో ‘చిట్టా’ అంటే కేవలం హెరాయిన్‌ మాత్రమే. కానీ నేడు వేర్వేరు పదార్ధాలు కలిసి అదో శక్తివంతమైన మత్తు పదార్ధాంగా తయారయ్యింది.

ప్రభుత్వ ఉద్యోగుల నియామకం నుంచి సర్వీసులోని వివిధ దశల్లో వారికి డోప్‌ టెస్ట్‌లు నిర్వహించేలా మార్గదర్శకాలు రూపొందించి, అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు