‘ఆర్థిక శాఖను మూసేశారు’

8 May, 2018 14:02 IST|Sakshi
కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్‌గా కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ దాడి కొనసాగిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతున్న వేళ రాహుల్‌ తన విమర్శలకు మరింత పదునుపెడుతున్నారు. తాజాగా ఆర్థిక మంత్రిత్వ శాఖ మూతపడిందంటూ సెటైర్లతో ట్వీట్‌ చేశారు.

ఆర్థిక మంత్రిత్వ శాఖలో నాయకులెవరూ లేకుండానే మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అనారోగ్యంతో ఏప్రిల్‌ నుంచి ఇంటికే పరిమితమవగా, ఆర్థిక కార్యదర్శి హస్ముఖ్‌ అథియా సెలవులో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాని ఆర్థిక మంత్రిని ఉద్దేశించి చెబుతున్నట్టు రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

‘ ప్రియమైన ఆర్థిక మంత్రికి..మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారు..ఆర్థిక శాఖ కార్యదర్శి విహార యాత్రలో ఉన్నారు..దీంతో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఆర్థిక మంత్రిత్వ శాఖను మూసివేయాలని నిర్ణయించాను..అప్పటివరకూ ప్రధాని కార్యాలయమే ఆర్థిక విధాన నిర్ణయాలు తీసుకుంటుంద’ని ప్రధానమంత్రి పేర్కొన్నట్టుగా రాహుల్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు