మోదీని విమర్శిస్తే జైలుకే: రాహుల్‌

4 Oct, 2019 17:26 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఎవరు విమర్శలు చేసినా జైలుకెళ్లడం ఖాయమని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. మూక దాడులకు సంబంధించి ప్రధానికి లేఖ రాసిన 50 మంది ప్రముఖలపై రాజద్రోహం కేసు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు. శుక్రవారం రాహుల్‌ మీడియాతో మాట్లాడుతూ..  ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన వారిపై ఏదో రకంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. మీడియా స్వతంత్రంగా వ్యవహరించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అందరికి తెలుసునని.. ఇందులో ఏ మాత్రం గోప్యత లేదని పరోక్షంగా బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.

ప్రస్తుతం మన దేశం నియంత పాలన వైపు అడుగులేస్తుందని అన్నారు. రాహుల్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న వయనాడ్‌ నియోజవర్గంలోని.. బండీపూర్‌ టైగర్‌ రిజర్వ్‌లో రాత్రివేళ ట్రాఫిక్‌ను నిషేదించడాన్ని ఖండించారు. అందుకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి మద్దతు తెలిపారు. కాగా, ముస్లింలు, దళితులు, మైనార్టీలపై దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని దేశంలోని పలువురు ప్రముఖులు మోదీకి బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. వారిలో  ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, దర్శకుడు మణిరత్నం, అపర్ణ సేన్‌, అనురాగ్ కశ్యప్, శ్యామ్ బెనెగల్, సౌమిత్రా ఛటర్జీ, గాయకుడు శుభా ముద్గల్ తదితరులు ఉన్నారు. జై శ్రీరాం నినాదాన్ని రెచ్చగొట్టే విధంగా వాడుకున్నారంటూ పలువురు ప్రముఖులు లేఖలో అభిప్రాయపడ్డారు. అయితే వీరిపై బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

>
మరిన్ని వార్తలు