'స్వచ్ఛభారత్ చేతల్లో చూపండి'

12 Apr, 2016 20:36 IST|Sakshi
ముంబై: స్వచ్ఛభారత్ పేరుతో ఫోటోలు దిగడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని శుభ్రత కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని ప్రధానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మోదీకి చురకలంటించారు. ఈశాన్య ముంబైలోని దేవనార్ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద డంపింగ్ యార్డ్ ను మంగళవారం రాహుల్ పరిశీలించారు.
 
మహారాష్ట్రలో బీజేపీ  ప్రభుత్వం స్వచ్ఛభారత్ కోసం మరింత కృషి చేయాల్సింది పోయి అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. డంపింగ్ యార్డులో చెత్త కాల్చడంతో పర్యావరణ కాలుష్యం పెరిగి ముంబై వాసులు అనేక దీర్ఘకాలక వ్యాధుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చెంబూర్ ప్రాంతంలో చిన్న పిల్లలు సైతం టీబీ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని రాహుల్ ప్రస్తావించారు. ఇక్కడ చెత్తను మండించడం ద్వారా వస్తున్న పొగ శాటిలైట్ నుంచి కూడా కనిపించిన విషయాన్ని గుర్తుచేశారు.

స్వచ్ఛభారత్ గురించి చెప్పడం, ఆచరణ రెండూ వేరని ప్రభుత్వాన్ని విమర్శించారు. ముంబై నగరం దేశ అభివృద్ధికి చిహ్నంగా ఉండాలని ఇలా కాలుష్యంతో రోగాల బారినపడ్డ ప్రజలతో కాదని రాహుల్ అన్నారు. జనావాసాలకు దూరంగా డంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేశారు. 
మరిన్ని వార్తలు