బిచ్చగాడి వద్ద రూ.48 లక్షలు!

13 Apr, 2016 13:00 IST|Sakshi
బిచ్చగాడి వద్ద రూ.48 లక్షలు!

మొన్న పశ్చిమ బెంగాల్ వలసజీవికి రూ. కోటి లభించడం, నిన్న అనంతపురం జిల్లాకు చెందిన యాచకుడికి రూ.65 లక్షల లాటరీ తగలటం, ఇటీవలే దుబాయ్ లో ఓ అడుక్కునే వ్యక్తి దగ్గర భారీగా నగదు దొరకటం.. ఇవన్నీ చూస్తే 'దరిద్రుడు ఏ రేవుకి వెళ్ళిన ముళ్ల చేపే దొరుతుంది'.. అనే పాత సామెతను రివైస్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినట్లు అనిపించడంలేదూ!

ఇతర దేశాల సంగతి పక్కనపెడితే చట్టాలు కఠినంగా అమలయ్యే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో బెగ్గింగ్ నేరమని, ప్రధాన వీధులు, ప్రర్థనా స్థలాల్లో ఎవరైనా అడుక్కున్నట్లు కనిపిస్తే పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుంటారని తెలిసిందే. అయితే నిఘా కళ్లుగప్పి ఇంకా ఎంతోమంది యాచకత్వాన్ని కొనసాగిస్తునే ఉన్నారట యూఏఈ ప్రధాన నగరం దుబాయ్ లో. అలాంటి వాళ్లను పట్టుకునేందుకు పోలీస్ శాఖతో కలిసి దుబాయ్ మున్సిపల్ శాఖ ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నది. అలా ఇప్పటివరకు మొత్తం 59 మంది యాచకులు పట్టుబడ్డారు. వాళ్ల వివరాలు, వస్తువులను పరిశీలించిన అధికారులు ఒక యాచకుడిదగ్గరున్న సొమ్మును చూసి వాపోయారు.

'మేం పట్టుకున్న యాచకుల్లో ఒకరి దగ్గర 270,000 దినార్లు(మన కరెన్సీలో దాదాపు రూ.48 లక్షలు) లభించాయి. ఇది చాలా పెద్ద మొత్తం. స్వల్పకాలిక వీసా, వర్కింగ్ లేదా బిజినెస్ వీసాల మీద దుబాయ్ కి వచ్చే కొందరు ఇక్కడ యాచకవృత్తిలోకి దిగుతున్నారు. దుబాయ్ లో అడుక్కునేవాళ్ల సంపాదన రోజుకు రమారమి 9,000 దినార్లు ఉంటుంది. అంటే బెగ్గర్లు గంటన్నరలో 1500 దినార్లు కూడబెడతారనమాట' అంటూ దుబాయ్ లో యాచకుల సంపాదన వివరాలను వెల్లడించారు మున్సిపల్ అధికారి ఫైజల్ అల్ బదియావి. గతేడాది రంజాన్ పండుగ నాడు మసీదుల ముందు అడుక్కుంటున్న 197 మంది యాచకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వచ్చే రంజాన్ పండుగలోగా నగరంలో యాచకులు లేకుండా చేయాలన్నది తమ లక్ష్యమని ఫైజల్ చెబుతున్నారు. బెగ్గర్లతో దేశ ప్రతిష్ట దిగజారుతుందని, ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా సాకుగా మారిందని అందుకే ఆ వృత్తిని యూఏఈ నిషేధించిందంటున్నారు ఫైజల్.

మరిన్ని వార్తలు