పాక్‌ సరిహద్దుల్లో రాజ్‌నాథ్‌ దసరా

15 Oct, 2018 02:23 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌–పాక్‌ సరిహద్దుల్లోని అత్యంత సున్నిత ప్రాంతమైన బికనూర్‌లో దసరా, ఆయుధపూజ కార్యక్రమాల్లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పాల్గొననున్నారు. ఇండో–పాక్‌ సరిహద్దుల్లో ఆయుధపూజ కార్యక్రమంలో ఓ సీనియర్‌ కేంద్రమంత్రి పాల్గొనడం ఇదే మొదటిసారి. రాజస్తాన్‌లోని బికనూర్‌ వద్దనున్న పాక్‌ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాన్‌లతో ఈ నెల 19న దసరా వేడుకల్లో రాజ్‌నాథ్‌ పాల్గొంటారని కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి.

అలాగే అక్కడి ప్రాంతంలో నిర్వహించబోయే ఆయుధపూజలో కూడా రాజ్‌నాథ్‌ పాల్గొంటారని వెల్లడించాయి. రెండ్రోజుల పర్యటనలో భాగంగా రాజ్‌నాథ్‌ ఈ నెల 18న రాత్రి బికనూర్‌ బోర్డర్‌ ఔట్‌పోస్టుకు చేరుకుంటారని.. 19న దసరా వేడుకల్లో జవాన్లతో కలసి పాల్గొంటారని అధికారులు తెలిపారు. పర్యటన సందర్భంగా రాజ్‌నాథ్‌ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. గతేడాది చైనా సరిహద్దుల్లోని ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ లో దసరా వేడుకల్లో రాజ్‌నాథ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు