రామాయణ్‌ సీరియల్‌ మరో రికార్డు

1 May, 2020 10:51 IST|Sakshi

న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీవీ ప్రేక్షకులను ఆనందింపజేయడానికి 1980, 90లలో అమితంగా ఆకట్టుకున్న రామాయణ్‌, మహాభారత్, శ్రీ కృష్ణ వంటి సీరియళ్లను దూరదర్శన్‌ తిరిగి ప్రసారం చేస్తుంది. పునఃప్రసారంలో భాగంగా ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించిన రామాయణ్‌ సీరియల్‌ తాజాగా మరో కొత్త రికార్డును తన పేరిట లిఖించుకొంది. లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 28 నుంచి డీడీలో టెలికాస్ట్‌ అవుతున్న ఈ సీరియల్‌ను ఏప్రిల్‌ 16న 7.7 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటివరకు రీ టెలికాస్ట్‌లో భాగంగా ప్రసారమైన సీరియళ్లలో అత్యధికంగా వీక్షించిన సీరియల్‌గా రామాయణ్‌ నిలిచింది. ఈ విషయాన్ని ప్రసారభారతి తన ట్విటర్‌లో గురువారం అధికారికంగా వెల్లడించింది. (మహాభారత్‌ డీడీ నంబర్‌ వన్)‌

మొత్తం 72 ఎపిసోడ్లుగా ఉన్న రామాయణ్‌ సీరియల్‌ దూరదర్శన్‌లో ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఒక ఎపిసోడ్, తిరిగి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు మరో ఎపిసోడ్ ప్రసారమవుతుంది. 1987లో దూరదర్శన్‌లో మొదటిసారిగా ప్రసారమైన రామాయణ్‌ సీరియల్‌ను రామానంద సాగర్‌ దర్శకత్వం వహించారు. సీరియల్‌లో రామునిగా అరుణ్‌ గోవిల్‌, సీతగా దీపికా చిలాకియా, రావణునిగా అరవింద్ త్రివేది, హనుమాన్‌గా ధారాసింగ్‌ తదితరులు నటించారు. 

మరిన్ని వార్తలు