మన్మోహన్‌ను మోసం చేశారు

27 Jul, 2016 08:28 IST|Sakshi
మన్మోహన్‌ను మోసం చేశారు

- బొగ్గు బ్లాకు కోసం రథి స్టీల్స్ కుట్ర
- నిర్ధారించిన ప్రత్యేక కోర్టు
- బొగ్గు కుంభకోణంలో రెండో తీర్పు
 
 న్యూఢిల్లీ : బొగ్గు బ్లాకు కుంభకోణంలో రథి స్టీల్, పవర్ లిమిటెడ్ (ఆర్‌ఎస్‌పీఎల్) కంపెనీ, దానికి సంబంధించిన ముగ్గురు అధికారులను ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. బొగ్గు గని కేటాయింపుల కోసం ఆర్‌ఎస్‌పీఎల్ తప్పుడు సమాచారమిచ్చి అప్పటి ప్రభుత్వాన్ని, నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ (బొగ్గు శాఖ ఇన్‌చార్జి మంత్రి)ను మోసం చేశారని తీర్పు చెప్పింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో ఇది రెండో తీర్పు. ఛత్తీస్‌గఢ్‌లోని కేస్లా ఉత్తర బొగ్గు బ్లాకును పొందేందుకు ఆ కంపెనీ, దాని అధికారులైన మేనేజింగ్ డెరైక్టర్ ప్రదీప్ రథి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉదిత్ రథి, ఏజీఎం కుశల్ అగర్వాల్‌లు మోసం (సెక్షన్ 420), నేరపూరిత కుట్ర (సెక్షన్ 120బీ) అభియోగాల కింద అవకతవకలకు పాల్పడినట్లు కోర్టు స్పష్టంచేసింది.

ఈమేరకు మంగళవారం ప్రత్యేక సీబీఐ జడ్జి భరత్ పరాశార్ తన 107 పేజీల తీర్పులో పేర్కొన్నారు. అనంతరం శిక్ష విధింపుపై జడ్జి వాదనలు విన్నారు. గరిష్ట శిక్ష విధించాలని సీబీఐ కోరింది. జడ్జి బుధవారం శిక్షలను ఖరారు చేయనున్నారు. ఐపీసీ సెక్షన్ 420 కింద జరిమానాతోపాటు ఏడేళ్ల వరకు శిక్ష విధించే అవకాశముంది. గత ఏప్రిల్‌లో ఇచ్చిన తొలి తీర్పులో జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ డెరైక్టర్లు ఆర్‌సీ రుంగ్లా, ఆర్‌ఎస్ రుంగ్టాలను కోర్టు దోషులుగా నిర్ధారించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు