సాధారణ రసాయనాలతోనే భారీ విధ్వంసం

15 Feb, 2019 18:16 IST|Sakshi

సాక్షి, న్యూ‍ఢిల్లీ : పుల్వామా జిల్లాలో గురువారం సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్ధం ఆర్డీఎక్స్‌ను ఉగ్రమూకలు వాడలేదని భావిస్తున్నారు. ఈ దాడిలో ఆర్డీఎక్స్‌కు బదులు ఎరువుల తయారీకి ఉపయోగించే సాధారణ రసాయనాలను ఉపయోగించి భారీ పేలుడుకు పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని చెబుతున్నారు. ఘటనా స్ధలం నుంచి సేకరించిన శాంపిల్స్‌ను పరిశీలించిన మీదట ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీలకు చెందిన ఫోరెన్సిక్‌ నిపుణులు పేలుడుకు వాడిన రసాయనాలపై వివరిస్తూ ఉగ్రవాదులు ఈ భీకర దాడిలో ఆర్డీఎక్స్‌ వాడలేదని చెప్పుకొచ్చారు.

భారీ పేలుడు కోసం ఎరువుల తయారీకి ఉపయోగించే రసాయనాలతో పాటు ఇనుప ముక్కలు, ఇతర పదార్ధాలను కలిపి ధ్వంస రచన సాగించారని ప్రాధమిక ఆధారాలతో వెల్లడవుతోందని ఫోరెన్సిక్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్డీఎక్స్‌ వంటి అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్ధం వాడకుండా ఇంతటి భీకర దాడికి ఉగ్రమూకలు పాల్పడటం విస్తుగొలుపుతోంది.

భద్రతా దళాల కన్నుగప్పి స్ధానిక మార్కెట్‌లో సులభంగా లభించే రసాయనాలతోనే భారీ పేలుడుకు అవసరమైన పరికరాన్ని ఉగ్రవాదులు రూపొందించారని నిపుణులు భావిస్తున్నారు. ఆత్మాహుతి దాడికి తెగబడిన జైషే ఉగ్రవాది అదిల్‌ అహ్మద్‌ దార్‌ మృతదేహాన్ని నిశితంగా పరిశీలించిన ఫోరెన్సిక్‌ నిపుణులు ఈ అంచనాకు వచ్చారు.పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు