కర్ణాటక: కాంగ్రెస్‌ ఎందుకు ఓడిపోయిందంటే..

10 Dec, 2019 19:19 IST|Sakshi

సాక్షి, బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీ ఉప​ఎన్నికల్లో బీజేపీ సునాయసంగా గెలుపు సాధించి, అధికారం చేజిక్కించుకుంది. కాంగ్రెస్‌ పార్టీ బలహీనంగా మారి.. ప్రస్తుతం ఆ పార్టీ భవిష్యత్‌ అగమ్యగోచరంలో పడింది. మహారాష్ట్ర మాదిరిగానే కర్ణాటకలో బీజేపీ హవాను అడ్డుకుంటామని ఆశపడ్డ కాంగ్రెస్‌ పార్టీకి సోమవారం వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ ఓటమికి పలు కారణాలు కనిపిస్తున్నాయని పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • జేడీఎస్‌తో పొత్తు, కూటమిలో అంతర్గత విభేదాలు, కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్ కార్యచరణలపై స్పష్టత లేకపోడం.
     
  • బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కేవలం ఆరు సీట్లు అవసరమయితే.. కాంగ్రెస్- జేడీఎస్ కూటమి తిరిగి అధికారాన్ని రాబట్టడానికి 12 స్థానాల్లో గెలవాల్సి రావడం.
     
  • మాజీ సీఎం సిద్ధరామయ్య జేడీఎస్-కాంగ్రెస్ కూటమితో ఏర్పడిన కుమారస్వామి ప్రభుత్వ పనితీరును గతంలో గట్టిగా విమర్శించడం.
     
  • కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక ఇన్‌చార్జీ కేసీ వేణుగోపాల్ ఉప ఎన్నికల ప్రచారంలో సరిగా పాల్గొనకపోవడం.
     
  • కాంగ్రెస్‌ పార్టీకి దిశానిర్దేశం చేసే సరియైన నాయకుడు లేకపోవడం, పార్టీలో అంతర్గత కుమ్ములాటను అడ్డుకట్ట వేయకపోవడం.
     
  • ఉత్తర కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ తిరిగి బలం పుంజుకోవాలంటే.. లింగాయత్‌లను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేయాలి.
     
  • కర్ణాటక ప్రాజ్ఞవ్యంత జనతా పార్టీ (కేపీజేపీ) నుంచి గెలిచి, కాంగ్రెస్‌ పార్టీలో విలీనమైన అనర్హత ఎమ్మెల్యే ఆర్‌. శంకర్‌కు.. ఉప​ ఎన్నికల్లో తిరిగి పోటీ చేయడానికి టికెట్‌ దక్కకపపోవడంతో.. ఆ స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసిన అరుణ్‌ కుమార్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు.  
     
  • అసెంబ్లీకి ఒక స్వతంత్ర శాసనసభ్యుడు, చట్టసభ సభ్యుడిని ప్రభుత్వం నామినేట్ చేయడం.
     
  • కర్ణాటక మాజీ స్పీకర్‌ కేఆర్‌ రమేష్‌ 17 మంది ఎమ్మెల్యేలను (శాసనసభ్యులు) అనర్హులుగా ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ వారిని ఉప ఎన్నికలలో పోటీ చేసే వెసులుబాటు కల్పించడంతో.. ఓటర్లు పార్టీలకతీతంగా అభ్యర్థి వైపు మొగ్గుచూపరనే విషయాన్ని గమనించవచ్చు. 

ఉప ఎన్నికలు ఎందు వచ్చాయంటే..?

  • కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి బీజేపీకి మద్దతివ్వడంతో.. జేడీఎస్‌ నేత కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వం కుప్పకూలి యడియూరప్ప ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అనంతరం జూలై 29న యడియూరప్ప అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గారు.
     
  • పార్టీ ఫిరాయించిన17 మంది కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేలను స్పీకర్‌ అనర్హులుగా ప్రకటించారు. సుప్రీంకోర్టు స్పీకర్‌ నిర్ణయాన్ని సమర్థిస్తూనే, అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే వెసులుబాటు కల్పించింది. దీంతో మైనారిటీలో ఉన్న యడియూరప్ప ప్రభుత్వ మనుగడకు, అనర్హత ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తుకు 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు కీలకంగా మారాయి.
     
  • డిసెంబర్‌ 5న జరిగిన ఉప ఎన్నికల్లో.. అనర్హతకు గురైన ఎమ్మెల్యేల్లో 13 మంది బీజేపీ తరఫున బరిలో దిగారు. గతంలో ఈ 15 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. 12 స్థానాల్లో కాంగ్రెస్, 3 సీట్లలో జేడీఎస్‌ గెలుపొందాయి. కీలకంగా మారిన ఈ  ఉప ఎన్నికల్లో 15 స్థానాలు కైవసం చేసుకుంటామని సీఎం యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు.
     
  • ఇక ఎన్నికల్లో 13 మంది అనర్హులు బీజేపీ తరఫున పోటీ చేశారు.  అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవులు ఇస్తామని సీఎం యడియూరప్ప ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం సొంతంగా మెజారిటీ సాధించాలంటే కనీసం 8 స్థానాల్లో గెలవాల్సి ఉంది. అయితే  బీజేపీ, కాంగ్రెస్‌ అన్నిస్థానాల్లోను, జేడీఎస్‌ 12 చోట్ల పోటీలో ఉంది.
     
  • డిసెంబరు 9న వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో.. బీజేపీ తరఫున పోటీ చేసిన 13 మంది అనర్హత ఎమ్మెల్యేల్లో 11 మంది విజయం సాధించారు. కాంగ్రెస్‌కు ఘోర పరాజయం చవిచూడగా.. బీజేపీ ఘన విజయం సాధించింది. ఎంటీబీ నాగరాజు, హెచ్‌.విశ్వనాథ్ బీజేపీ నుంచి పోటీచేసి ఓడిపోగా.. ఆర్‌.శంకర్‌కు టికెట్‌ దక్కలేదు.
     
  • 15 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 12 సీట్లను కమలం పార్టీ గెల్చుకుని విజయఢంకా మోగించింది. రెండు స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.  కర్ణాటక ఉప ఎన్నికల్లో విజయంతో రాష్ట్రంలో యడియూరప్ప ప్రభుత్వం మెజారిటీ మార్క్‌ను (113) సునాయాసంగా అధిగమించి.. 117 స్ధానాలతో బలం సాధించి.. రాష్ట్రంలో సుస్థిర పాలన గమ్యం సుగమైంది.
     
  •  సీఎం యడియూరప్ప సొంత జిల్లా మాండ్యలో.. ఒక్కసారి కూడా సీటు గెలువని బీజేపీ ఉప ఎన్నికల ద్వారా తొలిసారి అసెంబ్లీ సీటును తన ఖాతాలో వేసుకుంది. ఒక్కలింగ సామాజిక వర్గానికి కంచుకోట లాంటి మాండ్య జిల్లాలో బీజేపీ గెలవడాన్ని బట్టి కాషాయ పార్టీ హవా సాగిన విధానాన్ని అర్థం చేసుకోవచ్చు.
     
  •  కర్ణాటక ఉప ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎల్పీ నేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు గుండూరావు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
మరిన్ని వార్తలు