రెమిడిసివిర్‌ : అత్యవసర కేసుల్లో వాడేందుకు అనుమతి

18 Jun, 2020 14:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్‌-19 చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తుందని చెబుతున్న యాంటీ వైరల్‌ డ్రగ్‌ రెమిడిసివిర్‌ నెలాఖరు కల్లా భారత మార్కెట్‌లో అందుబాటులో ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కరోనా మహమ్మారితో తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో వెంటిలేటర్లపై ఉండే రోగులకు అత్యవసరంగా రెమిడిసివిర్‌ను వాడేందుకు డ్రగ్‌ కంటోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఇటీవల ఆమోదించింది. దేశీయంగా పలు ఫార్మా కంపెనీలు రెమిడిసివిర్ ఉత్పత్తిని చేపట్టడంతో ఈ డ్రగ్‌ విస్తృతంగా అందుబాటులో ఉంది. ఆక్సిజన్‌ సపోర్ట్‌ అవసరమైన కేసుల్లోనే తక్కువ డోస్‌లో రెమిడిసివిర్‌ వాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

గిలెడ్‌ సైన్సెస్‌ అభివృద్ధి చేసిన ఈ డ్రగ్‌ కోవిడ్‌-19 రోగులపై వాడగా మెరుగ్గా పనిచేసిందని వెల్లడైంది. అమెరికాలోనూ రెమిడిసివిర్‌ను ఎమర్జెన్సీ కేసుల్లోనే వైద్యల పర్యవేక్షణలో పరిమిత డోసేజ్‌లో వాడుతున్నారు. కరోనా వైరస్‌చికిత్సలో ఈ మందు భద్రత, సామర్ధ్యంపై మరింత సమాచారం కోసం అదనపు క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్న క్రమంలో అత్యవసర కేసుల్లోనే ఈ డ్రగ్‌ను వాడేందుకు అనుమతించారు. ఈ డ్రగ్‌ పేటెంట్‌ కలిగిన గిలెడ్‌ సైన్సెస్‌ మే 29న రెమిడిసివిర్‌ దిగుమతులు, మార్కెటింగ్‌ కోసం భారత ఔషధ నియంత్రణ మండలికి దరఖాస్తు చేసుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

చదవండి : కోవిడ్‌-19 : అమిత్‌ షా కీలక భేటీ

మరిన్ని వార్తలు