వాడి విడుదల మాకు చెంపదెబ్బ

4 Dec, 2015 11:54 IST|Sakshi

న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్రేప్ కేసులో బాలనేరస్థుడి విడుదల తమకు చెంపదెబ్బ లాంటిదని నిర్భయ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తామెంత మొరపెట్టుకున్నా ఆ నీచుడిని విడుదల చేయడం సమాజానికి చాలా నష్టమన్నారు. అలాంటి నేరస్తుడి  మొహాన్ని ప్రపంచానికి చూపించాలని డిమాండ్ చేశారు. వాడి ముసుగు తొలగించిన అందరూ  చూసేలా చేయాలని,  తత్ఫలితంగా వాడు  మరో అఘాయిత్యానికి తెగబడకుండా నిరోధించాలని కోరారు.

ఒక స్వచ్ఛందసంస్థ అక్కున చేర్చుకున్న ఆ దుర్మార్గుడు తమ బిడ్డను అతి కిరాతకంగా పొట్టన పెట్టుకున్నాడని నిర్భయ తల్లి ఆరోపించారు. మళ్లీ అలాంటి నేరానికి పాల్పడకుండా అతణ్ని ఒక కంట కనిపెట్టి  ఉండాలన్నారు. నిర్భయ వర్ధంతి  సమీపిస్తున్న ఈ సమయంలో అతగాడిని విడుదల చేయడం తమకు చాలా బాధ కలిగించిందని, అయినా తాము నిస్సహాయులమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్య18 ఏళ్లలోపు వయసున్న మగపిల్లలకు ధైర్యాన్నిస్తుందని వాదించారు. ఆడపిల్లలపై మరిన్ని నేరాలకు, అఘాయిత్యాలకు ఉసిగొల్పుతుందని వ్యాఖ్యానించారు. చాలామంది ఆ   నేరస్తుడిని రక్షించడానికి ప్రయత్నించడం విచారకరమన్నారు.

అటు నిర్భయ  తండ్రి కూడా నేరస్తుడి విడుదలను వ్యతిరేకించారు. విడుదలకు ముందు అతని మానసిక స్థితిని, ఆలోచనాధోరణిని అంచనా వేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. దీన్ని నిరసిస్తూ హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ మానవహక్కుల సంఘానికి ఒక మొమోరాండం సమర్పించారు.

మరిన్ని వార్తలు