రాజకీయ భూకంపం : మహారాష్ట్ర బాటలో గోవా..

29 Nov, 2019 12:36 IST|Sakshi

ముంబై : మహారాష్ట్ర తర్వాత గోవాలోనూ బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుంటాయని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యలు కాషాయ పార్టీలో కలకలం రేపుతున్నాయి. బీజేపీ పాలిత గోవాలో గోవా ఫార్వార్డ్‌ పార్టీ (జీఎఫ్‌పీ) అధ్యక్షుడు విజయ్‌ సర్ధేశాయ్‌ ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి శుక్రవారం ఉదయం సంజయ్‌ రౌత్‌తో భేటీ కావడం బీజేపీ వర్గాల్లో గుబులు రేపుతోంది. గోవాలో నెలకొన్న రాజకీయ పరిస్థితిపై వారు చర్చించినట్టు ప్రచారం సాగడంతో బీజేపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. జీఎఫ్‌పీ చీఫ్‌ విజయ్‌ సర్ధేశాయ్‌ సహా కనీసం నలుగురు ఎమ్మెల్యేలు శివసేనతో టచ్‌లో ఉన్నారని రౌత్‌ పేర్కొన్నారు.

మహరాష్ట్రవాది గోమంతక్‌ పార్టీ చీఫ్‌ సుధిన్‌ దవిల్కార్‌తోనూ తాను మాట్లాడానని, గోవా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కొద్దిమంది ఇతర ఎమ్మెల్యేలూ తమతో టచ్‌లో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. గోవా ప్రభుత్వాన్ని అనైతికంగా ఏర్పాటు చేశారని, కాంగ్రెస్‌ సహా పలు పార్టీలతో తాము ప్రత్యేక ఫ్రంట్‌ను నెలకొల్పి గోవాలో త్వరలోనే అద్భుతం చోటుచేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర తరహా మేజిక్‌ను గోవాలో పునరావృతం చేస్తామని గోవా మాజీ డిప్యూటీ సీఎం విజయ్‌ సర్ధేశాయ్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు