ఆర్టికల్‌ 35 ఏ విచారణ వాయిదా

31 Aug, 2018 12:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టికల్‌ 35ఏ రాజ్యాంగ చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సర్వోన్నత న్యాయస్ధానం వచ్చే ఏడాది జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. ఈ ఏడాది డిసెంబర్‌లో జమ్మూ కశ్మీర్‌లో పంచాయితీ ఎన్నికలు ముగిసిన అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్‌ 35ఏపై విచారణను కోర్టు వాయిదా వేసిందని, వచ్చే ఏడాది జనవరి 19న విచారణ చేపడుతుందని సుప్రీం న్యాయవాది వరుణ్‌ కుమార్‌ తెలిపారు.

పంచాయితీ ఎన్నికలు ముగిసే వరకూ విచారణను వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం కోరినమీదట అప్పటివరకూ విచారణను వాయిదా వేసేందుకు కోర్టు అంగీకరించిందని న్యాయవాది డీకే దూబే పేర్కొన్నారు. ఆర్టికల్‌ 35ఏ ప్రకారం జమ్మూ కశ్మీర్‌లో రాష్ట్ర ప్రజలు మినహా భారత పౌరులు చరాస్తులు కొనుగోలు చేసేందుకు వీలులేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు పొందేందుకు, ఓటు హక్కుకు అనర్హులు.

కాగా ఈ కేసులో సుప్రీం కోర్టులో పలు రాజకీయ పార్టీలు జోక్యం చేసుకునేందుకు పిటిషన్లు వేశాయి. సుప్రీం కోర్టులో ఆర్టికల్‌ 35ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తన వాదనను దీటుగా వినిపించేందుకు సీనియర్‌ న్యాయవాది, భారత మాజీ అటార్నీ జనరల్‌ గోపాల్‌ సుబ్రమణియన్‌ను నియమించింది.

>
మరిన్ని వార్తలు