మోదీకి క్లీన్‌చిట్‌పై పిటిషన్‌ : విచారణ జనవరికి వాయిదా

3 Dec, 2018 15:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్ర మోదీకీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ జకియా జాఫ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం వాయిదా వేసింది. ఈ అల్లర్ల వెనుక కుట్ర కోణానికి అవసరమైన ఆధారాలను సమర్పించేందుకు పిటిషనర్లు సమయం కోరడంతో పిటిషన్‌పై విచారణను కోర్టు జనవరి మూడో వారానికి వాయిదా వేసింది.

గుజరాత్‌ అల్లర్ల కేసులో మోదీని సిట్‌ అధికారులు 9 గంటల పాటు ప్రశ్నించిన మీదట ఈ ఘర్షణల్లో ఆయన పాత్ర లేదని సిట్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. గోద్రా అనంతర ఘర్షణల్లో పెద్దసంఖ్యలో చోటుచేసుకున్న మృతుల్లో ఒకరైన మాజీ ఎంపీ ఇషాన్‌ జాఫ్రి భార్య జకియా సిట్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ చేసుకున్న అప్పీల్‌ను గుజరాత్‌ హైకోర్టు గత ఏడాది అక్టోబర్‌ 5న తిరస్కరించింది.

హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పిటిషనర్లు సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. జకియా జాఫ్రి పిటిషన్‌ విచారణను జస్టిస్‌ ఏఎం కన్విల్కార్‌, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాతో కూడిన సుప్రీం బెంచ్‌ జనవరి మూడో వారానికి వాయిదా వేసింది. సిట్‌ మోదీకి క్లీన్‌ చిట్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషనర్‌ ప్రత్యేక న్యాయస్ధానం ఎదుట నిరసన వ్యక్తం చేసినా దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేసు మూసివేత నివేదికను సిద్ధం చేశారని జాఫ్రి న్యాయవాది సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించారు.

మరిన్ని వార్తలు