జనరల్‌ కేటగిరీల కన్నా వేగంగా..

8 Apr, 2018 22:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జనరల్‌ కేటగిరీ విద్యార్థుల కంటే వేగంగా షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తరగతులు, ఓబీసీ వర్గాలకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థులు నేర్చుకుంటున్నారు. ఇంజనీరింగ్‌ విద్యార్థుల నేర్చుకునే సామర్థ్యాన్ని వివిధ కొలమానాలకు అనుగుణంగా పరీక్షించినపుడు ఆసక్తి రేకెత్తించే ఈ అంశం వెల్లడైంది. అంతేకాకుండా ఎస్సీ విద్యార్థుల కంటే ఎస్టీ విద్యార్థులు త్వరగా నేర్చుకుంటున్నట్టు, ఓబీసీ విద్యార్థుల కంటే  ఎస్సీ విద్యార్థులు మెరుగైన స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది.  అమెరికాకు చెందిన స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ  దేశవ్యాప్తంగా విస్తతస్థాయిలో నిర్వహించిన ఓ  సర్వేలో ఇది వెలుగులోకి వచ్చింది.  ఈ విశ్వవిద్యాలయంతో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) గతేడాది కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈ అధ్యయనం జరిగింది.

రెండు భాగాలుగా పరిశీలన...

2017 అక్టోబర్, నవంబర్‌లలో విద్యా సంబంధిత అంశాలు, ఉన్నతస్థాయి ఆలోచన ధోరణిలపై రెండు భాగాలుగా దీనిని నిర్వహించారు. ఇందులో గణితం, భౌతికశాస్త్రం తదితరాల్లో పరీక్షలతో పాటు, సృజనాత్మకత, తార్కితతో కూడిన హేతుబద్ధత, శాస్త్రీయ ధోరణి వంటి అంశాలను పరిశీలించారు. ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం నుంచి మూడో సంవత్సరం వరకు చదువుతున్న విద్యార్థుల్లో అణగారిన వర్గాలకు చెందిన వారు ఈ అంశాల్లో పరిణామాత్మక ప్రదర్శన కనబరిచారు.  అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థుల్లో నేర్చుకోవాలనే తపనే వారిని తామున్న ఇబ్బందికర పరిస్థితులను అధిగమించేందుకు పురిగొల్పుతోందని ఏఐసీటీఈ చైర్మన్‌ అనిల్‌ సహస్రబుద్ధే పేర్కొన్నారు. ఉన్నతవర్గాల పిల్లలు చదువుకునే విద్యాసంస్థల్లో కాకుండా ఇతర కాలేజీల్లో ఇంజనీరింగ్‌ అభ్యసిస్తున్న వారిలోనూ ఈ వర్గాల వారు థర్డ్‌ ఇయర్‌కు ఇచ్చేప్పటికీ  గణితం, భౌతికశాస్త్రం, పరిణామాత్మక అక్షరాస్యతలోనూ ఒకస్థాయికి చేరుకుంటున్నారని ఓ అధికారి వెల్లడించారు.

దేశవ్యాప్తంగా 50 విద్యాసంస్థల్లో...

దేశవ్యాప్తంగా ఒక క్రమపద్ధతి లేకుండా  మొత్తం 50 సాంకేతిక విద్యా సంస్థలు వాటిలో ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ వంటి  8 ఉన్నతస్థాయి, ఈ కోవలోకి రాని  42 విద్యాసంస్థలను స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీ ఎంపిక చేసింది.  అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం ఉండేలా గతేడాది మొదటి ఏడాది, 2019లో మూడో ఏడాది కూడా ఇదే గ్రూపుల విద్యార్థులను పరీక్షిస్తారు. ఐఐటీ వంటి ఉన్నతస్థాయి సంస్థల్లోని  స్టెమ్‌ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్‌) కోర్సుల్లో అమ్మాయిల ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నట్టుగా, మిగతా వాటిలో అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరిగినట్టుగా ఈ పరిశీలనలో గుర్తించారు. సంపూర్ణస్థాయిలో చూస్తే చైనా, రష్యాల కంటే వీరు వెనకబడినట్టు, అయితే ఈ దేశాల విద్యార్థుల కంటే భార త ఇంజనీరింగ్‌ విద్యార్థులు వేగంగా నేర్చుకున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఈ రెండుదేశాల్లోని ఇంజనీరింగ్‌ విద్యార్థులపై సైతం స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీ ఇదే విధమైన పరిశీలన నిర్వహించిన నేపథ్యంలో ఆయా అంశాలు వెల్లడయ్యాయి. –సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా