కావేరీ జలవివాద తీర్పు.. తమిళనాడుకు షాక్‌

16 Feb, 2018 11:14 IST|Sakshi
సుప్రీం కోర్టు (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : కావేరీ జల వివాదంలో తమిళనాడుకు షాక్‌ తగిలింది. నీటి పంపిణీలో కర్ణాటకకు ఊరటనిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. అత్యున్నత న్యాయస్థానం తమిళనాడుకు విడుదల చేయాల్సిన నీటిలో కోతను విధించింది. 120 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఉదయం తీర్పు వెలువరించింది.

‘కావేరీ నదీజలాలపై ఏ రాష్ట్రానికి పూర్తి అధికారం కాని, హక్కులు గానీ లేవు’ అని బెంచ్‌ వ్యాఖ్యలు చేసింది. కావేరీ జలాల్లో 177.25 టీఎంసీల(అంతకు ముందు 192 టీఎంసీలుగా ఉండేది) నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక కర్ణాటకకు యథాతథంగా నీటి కేటాయింపులు కొనసాగుతాయన్న కోర్టు.. 14.75 టీఎంసీల నీటిని అదనంగా కేటాయించింది. దీంతోపాటు బెంగళూరు త్రాగు నీటి అవసరాల కోసం 4.75టీఎంసీల నీటిని కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.

ఇక చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతోపాటు జస్టిస్‌ ఏఎం ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లు ధర్మాసనం సభ్యులుగా ఉన్నారు.

సరిహద్దులో ఉద్రిక్తత... 

తీర్పు నేపథ్యంలో తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ బస్సులను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు.. చెక్‌ పోస్టుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓవైపు కర్ణాటకలో సంబరాలు జరుపుకుంటుండగా.. తమిళనాడులో నిరసనలు మొదలయ్యాయి.  కావేరీ జలాల తీర్పుపై తమిళ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేయగా.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారమంటూ తమిళనాడులో విపక్షాలు ధర్నాకు దిగాయి. కర్నాటకలో ఎన్నికలు జరగనుండటంతో వారికి సానుకూలంగా తీర్పు వెలువరించేలా కేంద్రం న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చిందన్న విమర్శలు మొదలయ్యాయి. రాష్ర్టంలో శాంతి భద్రతలపై డీజీపీతో ముఖ్యమంత్రి పళని సామి సమీక్ష నిర్వహించారు. తమిళనాడులోని కన్నడ పాఠశాలలు, బ్యాంకులు, హోటళ్లకు భారీ భద్రత కల్పించారు.

కావేరీ జల వివాద నేపథ్యం...

 • కావేరీ నదికి దక్షిణ గంగా పేరుంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు కావేరీ నీరే ప్రధానం. దక్షిణ కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఇది పుట్టి, తమిళనాడు, కేరళ, పుదుచెర్రీల మీదుగా ప్రవహిస్తుంది. 
 • వంద సంవత్సరాలకు పైగా ఇరు రాష్ట్రాలకు మధ్య జల వివాదం నెలకొంది.  నీటికొరత, సమస్యలపై పరిష్కారం చూపాలంటూ 1990లో కేంద్రం ప్రభుత్వం ఓ ట్రిబ్యూనల్‌ ఏర్పాటు చేసింది
 • కావేరీ జల వివాద ట్రిబ్యునల్‌ సీడబ్ల్యూడీటీ గతంలో(2007) ఉత్తర్వులు నీటి లభ్యత ఆధారంగా జలాలు ఎలా పంచుకోవాలో పేర్కొంటూ తీర్పు ఇచ్చింది. 
 • కావేరీ జలాలను 740 టీఎంసీలుగా లెక్కగట్టిన ట్రిబ్యునల్‌ అందులో తమిళనాడుకు 192 టీఎంసీలు, కర్ణాటకకు 270 టీఎంసీలు, కేరళ 30, పుదుచెర్రీలకు 7టీఎంసీలను కేటాయించింది. అయితే టిబ్యునల్‌ కేటాయింపుల కంటే కేరళ అదనంగా తీసుకుంటుందని తమిళనాడు మొదటి నుంచి ఆరోపిస్తుండగా.. వర్షాభావ పరిస్థితులతో తమిళనాడుకు నీటిని విడుదల చేయటం కుదిరే పని కాదని కర్ణాటక స్పష్టం చేసింది.
 • 2016 సెప్టెంబర్‌ 5న అత్యున్నత న్యాయస్థానం పదిరోజులపాటు 15,000 క్యూసెక్కుల నీరు ఇవ్వాలని ఆదేశించిటంతో ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 • రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఉత్తర్వులను సవరించాలంటూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసింది.
 • అంతకు ముందు ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ 12,000 క్యూసెక్కుల నీల్లు(సెప్టెంబర్‌ 20వ తేదీ వరకు) ఇవ్వాలని ఆదేశం. 
 • నీళ్లు తక్కువ ఉన్నాయని చెప్పటంతో 2 వేల క్యూసెక్కులు ఇవ్వాలని మరోసారి ఆదేశాలు. 
 • ఆ ఆదేశాలను సైతం ఉల్లంఘించటంతో రూ. 2,480 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ గతేడాది జనవరి 9న తమిళనాడు ప్రభుత్వం డిమాండ్ చేసింది‌. 
 • చివరకు సీడబ్ల్యూడీటీ ఇచ్చిన జల పంపిణీ తీర్పును వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్‌ను విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు. 
 • కొరత ఉన్న నేపథ్యంలో తమిళనాడుకు నీటిని ఎలా విడుదల చేయాలని.. దేవుడే వర్షాలను కర్ణాటకు పంపుతాడన్న రీతిలో ట్రిబ్యునల్‌ పంపిణీలు చేపట్టిందని కర్ణాటక తరపున సీనియర్‌ న్యాయవాది ఫాలి నారిమన్‌ వాదనలు వినిపించారు. నీటి పంపిణీలో మార్పులు చేపట్టాలంటూ తమిళనాడు విజ్ఞప్తి చేసింది.
 • పూర్తి వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం 2017 సెప్టెంబర్‌ 20న తీర్పును రిజర్వ్‌ చేసింది.
 • తమిళనాడుకు విడుదల చేయాల్సిన నీటిలో కోత విధిస్తూ మిగతా ప్రాంతాలకు ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారంగానే కేటాయింపులు కొనసాగాలని ఫిబ్రవరి 16, 2018న తుది తీర్పు వెలువరించింది.
Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా