కొన్ని అదృశ్య శక్తులు నాపై కుట్ర పన్నాయి

6 Jul, 2015 10:32 IST|Sakshi
కొన్ని అదృశ్య శక్తులు నాపై కుట్ర పన్నాయి

న్యూఢిల్లీ:  లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో సెయింట్ స్టీఫెన్స్ కళాశాల  ప్రిన్సిపల్  వాల్సన్ తంపూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను మొదట్నించి ఖండిస్తున్న ఆయన తనకు వ్యతిరేకంగా రాజకీయ కుట్ర జరుగుతోందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.  లైంగిక ఆరోపణల కేసు విచారణ నిమిత్తం మానవ వనరుల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగిన నేపథ్యంలో తంపూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కొన్నిశక్తులు తనకు వ్యతిరేకంగా పీహెచ్డీ విద్యార్థినిని వాడుకుంటున్నాయని  తంపూ  ఆరోపిస్తున్నారు.  నిగూఢమైన ప్రయోజనాల కోసం ఆమెను వాడుకుంటున్నారనీ, ఈ విషయం ఆమెకు ఆర్థం కావడంలేదని  అన్నారు. ఇదంతా చివరకు నాశనానికి దారి తీస్తుందంటూ తన అసహనాన్ని ప్రదర్శించారు.    ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలో ఆడియో టేపుల నిజాలు నిగ్గుతేలతాయని తంపూ వ్యాఖ్యానించారు. అయితే ఆ కొంతమంది ఎవరనేది వెల్లడించడానికి మాత్రం ఆయన నిరాకరించారు.


ఢిల్లీ  యూనివర్శిటీకి చెందిన సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ పీహెచ్డీ విద్యార్థిని తనను గైడ్  వేధిస్తున్నాడంటూ కేసు నమోదు చేసింది. కాలేజీ హెడ్గా తనకు అండగా నిలవాల్సిన  ప్రిన్సిపల్ తంపూ , నిందితుడికి వత్తాసు పలుకుతూ  కేసు వెనక్కి తీసుకోమని బెదిరిస్తున్నాడంటూ కొన్ని ఆడియో టేపులను ఆమె విడుదల చేసింది. ఈ టేపులు సోషల్ మీడియాలో  హల్చల్ చేయడంతో వివాదం రగులుకుంది.  ఈ నేపథ్యంలోనే మానవవనరుల శాఖ రంగంలోకి దిగింది.  దీనిపై విచారణ  చేయాల్సిందిగా యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్  ఆదేశించింది.  

మరోవైపు మహిళా సంఘాలు,  విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ..పీహెచ్డీ విద్యార్థినికి మద్దతుగా న్యాయ పోరాటానికి దిగాయి.   దీనిపై  సమగ్ర దర్యాప్తు జరిపి దోషులకు కఠినంగా  శిక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తూ సోమవారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాయి.
 

>
మరిన్ని వార్తలు