అసంప్షన్‌ ద్వీపంపై ముందడుగు

26 Jun, 2018 01:54 IST|Sakshi
ఢిల్లీలో సీషెల్‌ అధ్యక్షుడు ఫార్‌కు డార్నియర్‌ విమాన నమూనాను బహూకరిస్తున్న మోదీ. విందు కార్యక్రమంలో సితార్‌ వాయిస్తూ పాట పాడుతున్న ఫార్‌

అక్కడ భారత నౌకాదళ ఏర్పాటుకు భారత్‌–సీషెల్స్‌ అంగీకారం

మోదీ–ఫార్‌ సమక్షంలో ఆరు ద్వైపాక్షిక ఒప్పందాలు

సీషెల్స్‌కు 680 కోట్ల రుణానికి భారత్‌ అంగీకారం  

న్యూఢిల్లీ: సీషెల్స్‌లోని అసంప్షన్‌ ద్వీపంలో నౌకాదళ కేంద్రం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నేవల్‌ బేస్‌ ప్రాజెక్టు నిర్మాణానికి భారత్, సీషెల్స్‌ మధ్య అంగీకారం కుదిరింది. భారత పర్యటనలో ఉన్న సీషెల్స్‌ అధ్యక్షుడు డేనీ ఫార్, ప్రధాని మోదీ మధ్య సోమవారం జరిగిన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో హిందూ మహాసముద్రంలో భారత్‌ ప్రభావం పెరగనుంది. మోదీ, ఫార్‌ మధ్య సోమవారం రక్షణతోపాటు పలు ద్వైపాక్షిక అంశాలపైనా చర్చలు జరిగాయి. సీషెల్స్‌కు 10కోట్ల డాలర్ల (దాదాపు రూ.680కోట్లు ) రుణం ఇచ్చేందుకు భారత్‌ అంగీకరించింది. దీని ద్వారా సీషెల్స్‌లో మిలటరీ మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతుందని ఫార్‌ పేర్కొన్నారు.  

మా లక్ష్యం ఒక్కటే!: మోదీ
‘భారత్, సీషెల్స్‌లు కీలక వ్యూహాత్మక భాగస్వాములు. ప్రజాస్వామ్య విలువలను ఇరుదేశాలు గౌరవిస్తాయి. హిందూ మహాసముద్రంలో శాంతి భద్రతలు, సుస్థిరత నెలకొనాలన్నది మా లక్ష్యం’ అని మోదీ అన్నారు. 2015లో సీషెల్స్‌ పర్యటనలో హామీ ఇచ్చినట్లుగా.. డార్నియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను సీషెల్స్‌కు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ద్వీప సముదాయ దేశ రక్షణ సామర్థ్యం, తీర ప్రాంత మౌలికవసతులు పెంచుకునేందుకు భారత్‌ అన్ని విధాలా సాయం చేస్తుందని మోదీ స్పష్టం చేశారు.

సీషెల్స్‌లో మౌలిక వసతుల అభివృద్ధి, సైబర్‌ సెక్యూరిటీ, తీరప్రాంత భద్రత, వైట్‌ షిప్పింగ్‌ (మిలటరీయేతర వాణిజ్య నౌకల రవాణాపై సమాచార మార్పిడి), సీషెల్స్‌ దౌత్యాధికారులకు శిక్షణ (ఇరుదేశాల విదేశాంగ శాఖల మధ్య), గోవా సిటీ కార్పొరేషన్‌– సిటీ ఆఫ్‌ విక్టోరియా (సీషెల్స్‌) మధ్య పరస్పర సహకారంపై ఒప్పందాలు కుదిరాయి. భారత రాష్ట్రపతి కోవింద్‌ ఆహ్వానం మేరకు భారత పర్యటనకు వచ్చిన ఫార్‌ ఢిల్లీకి రాకముందే అహ్మదాబాద్, గోవాల్లో పర్యటించారు.

భారత పర్యటన సందర్భంగా అలదాబ్రా జాతికి చెందిన రెండు భారీ తాబేళ్లను సీషెల్స్‌ అధ్యక్షుడు కానుకగా ఇచ్చారు. వీటిని హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లో ఉంచనున్నారు.  ఫార్‌.. సోమవారం మోదీతో సమావేశం అనంతరం జరిగిన విందు సమావేశంలో సితార్‌ వాయించారు. ‘భారత్‌తో స్నేహబంధాన్ని సీషెల్స్‌ అధ్యక్షుడు  ఫార్‌ వినూత్నంగా వ్యక్తపరిచారు.  మోదీ ఏర్పాటుచేసిన విందులో సితార్‌ వాయిస్తూ.. పాట పాడారు’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ పేర్కొంటూ.. ఫార్‌ పాడిన పాటను ట్వీట్‌ చేశారు.  

ఆరోగ్యం జాగ్రత్త!
రాష్ట్రపతి భవన్‌లో ఫార్‌ కోసం ఏర్పాటుచేసిన  ‘గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’ కార్యక్రమంలో ఓ ఐఏఎఫ్‌ సైనికుడు వేసవి తాపం ధాటికి సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో అక్కడున్న అధికారులు, సహచరులు ఆయన్ను పక్కన కూర్చోబెట్టి ప్రాథమిక చికిత్సనందించారు. అయితే, కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ.. ఆ సైనికుడి వద్దకెళ్లి పరామర్శించారు. కాసేపు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు.   

అసంప్షన్‌ కథేంటి?
హిందూ మహాసముద్రంలోని సీషెల్స్‌లో పాగా వేయడం భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకం. 115 ద్వీపాల సమూహమైన సీషెల్స్‌తో ఒప్పందం కారణంగా ఈ ప్రాంతంలో భారత్‌ తన ప్రభావం పెంచుకునేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఈ సముద్రంలోని వివిధ దేశాల్లో తన మిలటరీ అస్తిత్వాన్ని పెంచుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది.  అందుకే తన ప్రాభవాన్ని పెంచుకోవాలని భారత్‌ వ్యూహాలు రచిస్తోంది. 2015లోనే అసంప్షన్‌ ఐలాండ్‌ను అభివృద్ధి చేసేందుకు భారత్‌ ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే.. సీషెల్స్‌లో దీనిపై వ్యతిరేకత మొదలైంది. చైనా–భారత్‌ల మిలటరీ వ్యూహంలో చిక్కుకుపోతామనే భావన అక్కడి ప్రజల్లో వ్యక్తమైంది. కాగా, ‘మా తీరప్రాంత భద్రతను దృష్టిలో పెట్టుకుని అసంప్షన్‌ ద్వీపంపై చర్చించాం. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తాం’ అని ఫార్‌ అన్నారు.
 

మరిన్ని వార్తలు