నేడు అమిత్‌ షా ఇంటికి.. షహీన్‌బాగ్‌ ర్యాలీ

16 Feb, 2020 04:09 IST|Sakshi
ముంబైలో సీఏఏకు వ్యతిరేకంగా శనివారం జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్న ముస్లింలు

న్యూఢిల్లీ/కోల్‌కతా/ముంబై: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వెనక్కు తీసుకోవాలంటూ షహీన్‌బాగ్‌ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇంటి వరకూ ర్యాలీ చేపట్టనున్నట్లు షహీన్‌బాగ్‌ నిరసనకారులు తెలిపారు. సీఏఏపై అనుమానాలు ఉన్నవారు తన వద్దకు వస్తే వివరిస్తానని అమిత్‌షా చెప్పినందుకే ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ర్యాలీ మొదలుకానుంది. ర్యాలీపై తమకు సమాచారం లేదని హోంశాఖ తెలిపింది. సీఏఏ, జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)పై దేశవ్యాప్తంగా నిరసనలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో నిరసనలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. శనివారం షహీన్‌బాగ్‌ నిరసనకారులు కొందరు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి మాట్లాడేందుకు సముఖత వ్యక్తం చేశారు.  

డబ్బులు, బిర్యానీ కోసమే నిరసనలు..
షహీన్‌బాగ్‌లో నిరసనలు తెలుపుతున్న వారు డబ్బు, బిర్యానీల కోసమే రోజూ వేదిక వద్ద కూర్చుంటున్నారని పశ్చిమబెంగాల్‌ బీజేపీ చీఫ్‌ దిలీప్‌ఘోష్‌ ఆరోపించారు. ‘నిరక్షరాస్యులు, సామాన్యులు, పేదలు, అజ్ఞానులు అక్కడ నిరసనల్లో పాల్గొంటున్నారు. నేతలిచ్చే డబ్బు, బిర్యానీల కోసమే నిరసనలు చేస్తున్నారు. పైగా వీరికి పంపే డబ్బంతా విదేశాల నుంచే వస్తోంది. కాంగ్రెస్‌ నేత చిదంబరం, సీపీఐ నేత బృందా కారత్‌లాంటి వారి ప్రసంగాలు వినే శ్రోతలు వారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ముంబైలో భారీ ర్యాలీ
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరపట్టిక (ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌)లకు వ్యతిరేకంగా శనివారం ముంబైలో భారీ ర్యాలీ జరిగింది. దీనికి వేలాది మంది హాజరు కాగా అందులో అధిక సంఖ్యలో మహిళలు ఉన్నారు. ఉర్దూ కవి ఫయాజ్‌ అహ్మద్‌ ఫయాజ్‌ రచించిన ‘హమ్‌ దేఖేంగే’ (మేం చూస్తాం) అంటూ.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనకు ముంబైతో పాటు నవీ ముంబై, థానేల నుంచి తరలివచ్చారు.

మరిన్ని వార్తలు