ఢిల్లీ ఎన్నికలు: కాంగ్రెస్‌ ఓటమిపై మహిళా నేతల ఫైర్‌!

11 Feb, 2020 20:28 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దేశ రాజధాని ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేక చతికిలపడిన కాంగ్రెస్‌ పార్టీ.. కొన్నిచోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో పార్టీ భారీ ఓటమిపై కాంగ్రెస్‌ మహిళా నాయకులు  షర్మిష్టా ముఖర్జీ, ఖుష్బూ సుందర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి .. నష్ట నివారణ చర్యలు చేపట్టాలని హితవు పలికారు.

ఈ మేరకు... ‘‘ ఢిల్లీలో మరోసారి మనం నాశనం అయిపోయాం. ఆత్మశోధన చేసుకున్నది చాలు. ఇది కార్యాచరణ మొదలుపెట్టాల్సిన సమయం. ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం చాలా ఆలస్యమైంది. ఒక వ్యూహం లేదు. రాష్ట్ర స్థాయిలో సమన్వయం లేదు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేవారు లేరు. మూలాలే సరిగ్గా లేవు. ఈ వ్యవస్థలో భాగమైన నేను కూడా ఈ వైఫల్యానికి నా వంతు బాధ్యత వహిస్తా’’అని షర్మిష్ట ట్విటర్‌ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చదవండి: థాంక్యూ ఢిల్లీ.. షాక్‌ తగిలిందా: ప్రకాశ్‌ రాజ్‌

అదే విధంగా ఖుష్బూ కూడా పార్టీ కార్యకర్తల తీరుపై విమర్శలు గుప్పించారు. ‘‘ఢిల్లీలో ఏదో అద్భుతం జరుగుతుందని ఊహించలేదు. మరోసారి ఘోరంగా విఫలమయ్యాం. మనం అసలు సరిగ్గా పనిచేస్తున్నామా? మనం చేసేది సరైందేనా? అసలు సరైన దారిలోనే ఉన్నామా? వీటన్నింటికీ.. ‘నో’ అనే కదా సమాధానం. కనీసం ఇప్పటి నుంచైనా పనిచేయడం మొదలుపెట్టాలి. క్షేత్రస్థాయిలో, మధ్య స్థాయిలో, ఉన్నత స్థాయిలో పరిస్థితులను చక్కబెట్టాలి’’ అని ఆమె ట్వీట్‌ చేశారు. కాగా మంగళవారం వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 70 స్థానాల్లో ఆప్‌ 62 సీట్లు గెలుపొందగా.. బీజేపీ 8 స్థానాలను కైవసం చేసుకుంది.

ఇది ఢిల్లీ ప్రజల విజయం : కేజ్రీవాల్‌

మరిన్ని వార్తలు