భారత్‌ను బలమైన శక్తిగా మార్చిన ఘనత పీవీదే

24 Dec, 2018 01:39 IST|Sakshi

ప్రముఖ పాత్రికేయుడు శేఖర్‌గుప్తా  

హైదరాబాద్‌ : అంతర్జాతీయంగా అనేక ఒడిదుడుకులు ఉన్న సమయంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ నరసింహారావు చేపట్టిన సంస్కరణలతో భారతదేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రముఖ పాత్రికేయుడు శేఖర్‌గుప్తా అన్నారు. బల హీన భారత్‌ను బలమైన శక్తిగా మార్చిన ఘనత పీవీదేనన్నారు. మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపించాల్సి వచ్చినా జాతీయ భద్రతపై ఆయన ఏనాడూ రాజీపడని దృఢసంకల్పం ప్రదర్శించారని కొనియాడారు. పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆదివారం ‘సాక్షి’ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని దస్పల్లా హోటల్‌లో పీవీ స్మారకోపన్యాసం చేశారు. 1991లో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర అనిశ్చితి ఉండేదని, గల్ఫ్‌ యుద్ధం ముగింపు, సోవియట్‌ పతనం, తదితర అంశాలతో భారత్‌లో ఆ కూడా ప్రభావం ఉన్న సమయంలో రాజీవ్‌ గాంధీ హత్యకు గురయ్యారని అలాంటి సమయంలో ప్రధానిగా పీవీ బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చినా అయోమయానికి గురికాకుండా దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేశారన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న భారత్‌ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంతో పాటు, విదేశీ విధానాన్ని కూడా కొత్త పుంతలు తొక్కించారన్నారు. అప్ప టిదాకా రష్యాతో మైత్రీబంధాన్ని నెరుపుతున్న భారత్‌కు సోవియట్‌ పతనం తర్వాత అమెరికా, ఇజ్రాయెల్‌ తదితర దేశాలతో మైత్రి ఏర్పడటానికి పీవీ చేసిన కృషిని చాలామంది మర్చిపోయారన్నారు. 

అద్వానీ మాటలు నమ్మారు.. 
బాబ్రీ మసీదు కూల్చివేత అంశంలో పీవీపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలు కావన్నారు. బాబ్రీ మసీదు జోలికి వెళ్లబోమని బీజేపీ నేత అద్వానీ కచ్చితంగా చెప్పిన మాటలను పీవీ నమ్మారని కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేయడంతో పీవీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని వెల్లడించారు. బాబ్రీ మసీదు విధ్వంసాన్ని ఆపేందుకు రాష్ట్రపతిపాలన విధించి ఉండొచ్చు కదా అని చాలా మంది పీవీని విమర్శిస్తుంటారని అలా కేంద్ర పాలన అమలుకు కనీసం 48 గంటలు పట్టేదని ఆలోగా జరగాల్సిన విధ్వంసం జరిగిపోయిందని పీవీ తనతో చెప్పారని శేఖర్‌గుప్తా గుర్తు చేసుకున్నారు. దేశంలో అల్లర్లు చెలరేగకుండా పీవీ చాకచక్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభంలో అనవసర విషయాల్లో సమయం వృథా చేసి చివరి రెండేళ్లలో జీఎస్టీ లాంటి కీలక సంస్కరణలు అమలు చేయడం ఇబ్బందికరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమానికి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి అధ్యక్షత వహించగా గౌరవ అతిథిగా సీనియర్‌ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు వ్యవహరించారు. జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న పీవీ బహుభాషా కోవిదుడిగా అందరికీ సుపరిచితులని ఆయన రాజకీయాల్లో లేకపోతే కచ్చి తంగా గొప్ప అధ్యాపకుడు, పరిశోధకుడు అయ్యేవారన్నారు. పీవీ తాను నిర్వహించిన అన్ని మంత్రిత్వ శాఖల్లో తనదైన ముద్రను వేసి పనితీరును మెరుగుపరిచారన్నారు. ప్రభుత్వ విభా గాలు సరైన విధానంలో పనిచేసేలా అనేక చర్య లు చేపట్టారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు నవోదయ విధానాన్ని రూపకల్పన చేయడంలో ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు.  
 

మరిన్ని వార్తలు