16 రోజుల యాత్ర స్పెషల్‌ ట్రైన్‌

11 Jul, 2018 13:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : రైల్వేశాఖ రామాయణంలో ప్రస్తావించిన ప్రముఖ ప్రదేశాలన్నింటిని ఒకే యాత్రలో సందర్శించుకునే ఆవకాశాన్ని కల్పిస్తోంది. అందుకోసం నవంబర్‌ 14న ప్రత్యేక పర్యాటక రైలు ‘శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్‌’ ను నడపనున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది. హిందూ చరిత్రలో రామాయణానిది ప్రత్యేక స్థానం. అందుకే రాముని జీవితంతో సంబంధం ఉన్న ప్రధాన ప్రాంతాలను యాత్రికులు సందర్శించుకునేలా ఈ స్పెషల్‌ ట్రైన్‌కు రూపకల్పన చేసింది. ఢిల్లీలో ప్రారంభమై తొలుత అయోధ్యలోని గర్హి రామ్‌కోట్‌, కనక్‌ భవన్‌ ఆలయాల సందర్శన తర్వాత  నందిగ్రామ్‌, సీతామర్హి, జనక్‌పూర్‌, వారణాసి, ప్రయాగ్‌, శ్రింగ్‌వర్పూర్‌, చిత్రకూట్‌, హంపీ, నాసిక్‌ల మీదుగా రామేశ్వరం చేరుకుంటుంది.

ఈ స్పెషల్‌ ట్రైన్‌లో 800మంది ప్రయాణించవచ్చు. 16 రోజుల పాటు యాత్ర కొనసాగుతోంది. ఒక్కో వ్యక్తికి 15,120 రూపాయలు వసూలు చేయనున్నారు. అందులోనే భోజన సదుపాయం, ధర్మశాలలతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు.వాటి కోసం ప్రత్యేక టూర్‌ మేనేజర్‌ను అందుబాటులో ఉంచుతారు. ఇందుకు సంబంధించిన బుకింగ్‌ త్వరలో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు రైల్వేశాఖ తెలిపింది.

రామాయణ యాత్రను ఐఆర్‌సీటీసీ రెండు ప్యాకేజ్‌లుగా విభజించింది. ఒకటి భారత్‌లో ఢిల్లీ నుంచి రామేశ్వరం వరకు కాగా, మిగిలినది శ్రీలకంలో సాగనుంది. యాత్రికులను విమానంలో శ్రీలంకు తీసుకెళుతారు. ఈ పర్యటనలో భాగంగా కండీ, నువారా ఎలియా, కొలంబో, నీగోమ్బోలను సందర్శించవచ్చని రైల్వేశాఖ తెలిపింది. శ్రీలంక 5 రోజుల పర్యటనకై ప్రత్యేంగా 47,600 రూపాయలతో ప్యాకేజ్‌ రూపొందించింది.  ఈలోపే రామాయణంలోని ప్రధాన ప్రదేశాలను సందర్శించేలా ఆగస్టు 28 నుంచి  సెప్టెంబర్‌ 9 వరకు మరో ప్రత్యేక రైలును నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అది త్రివేండ్రం నుంచి ప్రారంభమవుతోందని తెలిపింది.

మరిన్ని వార్తలు