‘బుస్‌..స్‌..స్‌’ ఇంత పెద్ద పామా..?

9 Jul, 2019 16:59 IST|Sakshi

సాక్షి, ఆగ్రా: ఎప్పటిలాగే అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఫ్యాక్టరీలో కొద్దిసేపటినుంచి ఏదో వింతైన శబ్దం వినిపిస్తోంది. శబ్దం ఏంటో తెలుసుకుందామని అందరూ సైలెంట్‌ అయిపోయారు. అందరిలో చిన్న కలకలం మొదలైంది. అది పాము బుసలు కొడుతున్న చప్పుడు. ‘బుస్‌..స్‌..స్‌..’ మంటున్న పాము ఎక్కడుందో కనుక్కుందామని అందరూ తలోదిక్కు వెతికారు. స్టోర్‌ రూమ్‌లో దాక్కున్న దాదాపు ఆరడుగుల భారీ పాము కంటబడడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. అది వారిని చూసి పారిపోయేందుకు యత్నించింది. వెంటనే వన్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే, భయంతో అది పరుగు పెట్టడం, స్టోర్‌రూమ్‌లో నక్కడంతో దాన్ని పట్టుకునేందుకు అధికారులకు చాలా సమయమే పట్టింది. సుమారు 30 నిముషాలు కష్టపడి వారు పామును  బంధించి అడవిలో వదిలిపెట్టారు. ఆగ్రాలోని అవంతి అంతర్జాతీయ షూ తయారీ ఫ్యాక్టరీలో సోమవారం ఈ సంఘటనజరిగింది.

పాము కనిపించగానే ప్రాణభయంతో దానికి హానితలపెట్టకుండా చాకచక్యంగా వ్యవహరించి తమకు సమాచారమిచ్చారని అధికారులు అన్నారు. ఫ్యాక్టరీ నిర్వాహకులకు వన్యసంరక్షణాధికారి ఎంవీ బైజురాజ్‌ కృతఙ్ఞతలు తెలిపారు. పాములను మనం ఏమీ అనని పక్షంలో అవి ఎవరికీ హాని చేయవని, వాటిని బెదరగొడితే కాటు ప్రమాదం ఉందని తెలిపారు. విషరహితమైన పాములు కూడా తమపై దాడి జరుగుతుందనుకుంటే కాటు వేస్తాయని అన్నారు.

మరిన్ని వార్తలు