పర్వతాల దెయ్యాన్ని ఈ పార్కు దగ్గర చూడొచ్చు..!

6 Jul, 2019 17:02 IST|Sakshi

డెహ్రడూన్‌: అరుదైన మంచు చిరుత ఒకటి ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి నేషనల్‌ పార్కు సమీపంలోని నెలాంగ్ వ్యాలీలో ఇటీవల దర్శనమిచ్చింది. పార్కు పక్కన  ఉన్న రోడ్డు మీద నుంచి నడుస్తూ ఓ పర్వతం వైపు వెళ్లింది. చిరుత రోడ్డుపై సంచరిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ప్రపంచంలోనే ప్రత్యేకమైన జాతికి చెందిన ఈ చిరుత వీడియోను పర్వీన్ కస్వాన్ అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘పర్వతాల దెయ్యం.. ప్రపంచంలోనే అరుదైన జాతి చిరుత.. గంగోత్రి నేషనల్‌ పార్క్‌ దగ్గర రోడ్డు మీద చూడొచ్చు’ అనే కాప్షన్‌తో అతను వీడియో షేర్‌ చేశాడు. ఈ ట్వీట్‌పై పలువురు కామెంట్‌ చేశారు.ఈ చిరుతను చూసిన వారు చాలా అదృష్టవంతులని ఒకరు.. ఆ మంచు చిరుత చాలా అందంగా ఉందని మరొకరు కామెంట్‌ చేశారు.

ఎతైన వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం..
ప్రపంచంలోని అత్యంత ఎతై​న వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాల్లో గంగోత్రి నేషనల్ పార్క్ ఒకటి. సముద్రమట్టం నుంచి సుమారు 11 వేల అడులు ఎత్తులో ఈ పార్కు ఉంది. ఇక నెలాంగ్ వ్యాలీ చైనా సరిహద్దుకు దగ్గరగా ఉండటం వల్ల  ఇక్కడ ఐటీబీపీ యూనిట్లు ఉంటాయి.  ఇక ఈ అరుదైన మంచు చిరుతల ఉనికి ఉత్తరఖండ్‌తో పాటు హిమాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో కూడా ఉంది. నెలాంగ్ వ్యాలీలో మంచు చిరుతలతో పాటు హిమాలయ నీలం గొర్రెలు, అంతరించిపోతున్న కస్తూరి జింక జాతులు కూడా ఉన్నాయి.

మరిన్ని వార్తలు