ఎన్డీయే మంత్రులకు 'సన్' స్ట్రోక్

28 Aug, 2014 13:00 IST|Sakshi
ఎన్డీయే మంత్రులకు 'సన్' స్ట్రోక్

ఎన్డీయే మంత్రులకు 'సన్' స్ట్రోక్ తగులుతోంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తనయుడి వివాదం మరవక ముందే మరో కేంద్రమంత్రి కూడా వార్తల్లో నిలిచారు. తాజాగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడపై రేప్ కేసు నమోదు అయ్యింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ  కార్తీక్‌గౌడపై వర్ధమాన నటి మైత్రేయి గౌడ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

దాంతో అతనిపై రేప్, చీటింగ్ కేసు నమోదు అయ్యాయి. ఈ కేసు విషయంలో కార్తీక్ గౌడ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను సదానంద గౌడ కొట్టిపారేశారు. అవన్నీ నిరాధారమేనని తేల్చిపారేశారు. అయితే పోలీసులు మాత్రం మంత్రి కుమారుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి...తన పని తాము చేసుకు పోతున్నారు.

మరోవైపు రాజ్నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్పై ఆరోపణల వ్యవహారం రాజకీయ దుమారంగా మారిన విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్లో బీజేపీ నేతగా ఉన్న పంకజ్ సింగ్ వ్యవహార శైలిపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహంగా ఉన్నారని, అవినీతి ఆరోపణలపై పంకజ్‌ను మందలించారని, దీనిపై రాజ్‌నాథ్ వివరణ ఇచ్చారని మీడియాలో వార్తలు సంచలనంగా మారాయి.

కాగా  మీడియాలో వచ్చిన ఈ వివాదం వెనుక  రాజ్‌నాథ్ అంటే గిట్టని, ఆ హోదాను ఆశిస్తున్న ఓ సీనియర్ నేత ఉన్నారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. అయితే తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలు వాస్తవమని తేలితే రాజకీయాల నుంచి వైదొలగుతానని రాజ్నాథ్ సింగ్ ప్రకటించటం విశేషం. ఏది ఏమైనా ఇద్దరు కేంద్ర మంత్రులు తమ సుపుత్రుల ద్వారా ప్రముఖంగా వార్తల్లోకి నిలవటం విశేషం.

మరిన్ని వార్తలు