త్వరలో రాహుల్‌కు పట్టాభిషేకం?

2 Jan, 2016 02:51 IST|Sakshi
త్వరలో రాహుల్‌కు పట్టాభిషేకం?

న్యూఢిల్లీ: కాంగ్రెస్ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాహుల్‌గాంధీ ‘పట్టాభిషేకం’ త్వరలోనే జరగనుందా? ఇప్పటికే జాప్యం జరిగిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు.. యూరప్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వచ్చే వారంలో తిరిగొచ్చాక జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్‌కు పగ్గాలు అప్పగిస్తారన్న సంకేతాలూ వెలువడుతున్నాయి. రాహుల్ 8వ తేదీ తర్వాత ఎప్పుడయినా తిరిగివస్తారని.. ఆయన వచ్చాక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ ఉంటుందని, పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు తాజాగా వెల్లడించాయి.

పార్టీ పగ్గాలు స్వీకరించేందుకు ఆయన సిద్ధంగా లేరనే వాదనలో నిజంలేదన్నాయి. అస్సాం శాసనసభ ఎన్నికలు పూర్తయ్యేదాక ఆగాలని నిర్ణయించారనే వార్తలోనూ నిజంలేదని కొట్టివేశాయి. ఎప్పట్లోగా ఆయనపై బరువుబాధ్యతలు మోపుతారన్నది చెప్పడానికి నిరాకరించాయి. కొద్దిరోజుల కిందట కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాహుల్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఎప్పుడు చేస్తారంటూ సోనియాగాంధీని విలేకరులు ప్రశ్నించగా ‘ఆయన్నే అడగండి’ అని ఆమె సమాధానం ఇవ్వడం గమనార్హం.

మరిన్ని వార్తలు