ఎంపీలనూ పట్టించుకోరా: సుబ్బిరామిరెడ్డి

11 May, 2016 17:46 IST|Sakshi
ఎంపీలనూ పట్టించుకోరా: సుబ్బిరామిరెడ్డి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రక్షణ కల్పిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) గార్డులు ఎంపీలకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి సభలో మండిపడ్డారు. ఈ విషయమై ఆయన రాజ్యసభలో 188 నిబంధన కింద ప్రివిలేజి నోటీసు ఇచ్చారు. ఎంపీల పట్ల ఎస్పీజీ సభ్యులు అమర్యాదగా, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని ఆయన చెప్పారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నప్పుడు వాళ్లు తనపట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు.

వాళ్ల విధులకు తాము ఆటంకం కలిగించబోమని, కానీ కనీసం ఎంపీలమన్న గౌరవం అయినా ఉండాలి కదా అని సుబ్బిరామిరెడ్డి అన్నారు. ఆయన ఇచ్చిన ప్రివిలేజి నోటీసును పరిశీలిస్తామని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ చెప్పారు. అయితే, ఒక ఎంపీ స్వయంగా తన సొంత అనుభవాన్ని చెబుతున్నప్పుడు కేవలం నోటీసులకు మాత్రమే ఈ అంశం పరిమితం కాకూడదని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ అన్నారు. ఈ నోటీసు పరిధి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు రక్షణ కల్పిస్తున్న ఎస్పీజీకి కూడా విస్తరించాలని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి డిమాండ్ చేశారు. దీంతో కొద్దిసేపు సభలో గందరగోళం నెలకొంది.

>
మరిన్ని వార్తలు