అప్పులు తెస్తూ...కమీషన్లు దండుకుంటున్నారు | Sakshi
Sakshi News home page

అప్పులు తెస్తూ...కమీషన్లు దండుకుంటున్నారు

Published Wed, May 11 2016 6:37 PM

అప్పులు తెస్తూ...కమీషన్లు దండుకుంటున్నారు - Sakshi

హైదరాబాద్: వేల కోట్ల రూపాయలను అప్పులుగా తెస్తూ...వందల కోట్లను టీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్లగా దండుకుంటున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమ‌ర్శించారు. బుధ‌వారం టీపీసీసీ ఉపాధ్యక్షులు, డికె అరుణ‌, ఎమ్మెల్యే సంప‌త్ కుమార్‌ల‌తో క‌లిసి గాంధీభ‌వ‌న్‌లో ఆయన విలేక‌రుల‌తో మాట్లాడారు.

కేసీఆర్ ప్రభుత్వం ఈ రెండేళ్ళలో రాష్ర్టం అభివృద్ది కోసం కానీ, ప్రజ‌ల కోసం గానీ చేసిందేమి లేద‌ని ఉత్తమ్ అన్నారు. మ‌హారాష్ర్టతో ఒప్పందం విష‌యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో ఘ‌న‌కార్యం సాధించిన‌ట్టు గొప్పలు చెప్పుకుంటుంద‌న్నారు. ప్రాణ‌హిత ప్రాజెక్టు విష‌యంలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ‌కు శాశ్వతంగా ద్రోహం చేసిందని ఆయన విమర్శించారు. తమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 152 మీట‌ర్ల నుంచి 148 మీట‌ర్లకు త‌గ్గించడం అన్యాయమని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న దోపిడీకి తాము పూర్తి వ్యతిరేకమని .. ఆర్డీఎస్ ప్రాజెక్టును సీఎం పట్టించుకోవడం లేదని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే డికె అరుణ మాట్లాడుతూ ఆర్డీఎస్ గురించి ఉద్యమాలు జ‌రిగిన‌పుడు హ‌రీష్ రావు ఎక్కడున్నార‌ని ప్రశ్నించారు. మేము ఆర్డీఎస్ తూముల ధ్వంసంపై ఉద్యమాలు చేసిన స‌మ‌యంలో ఇదే కేసీఆర్ వ‌చ్చి మ‌ద్దతు ఇచ్చార‌ని ఆ విష‌యాల‌ను కేసీఆర్ను అడిగి హ‌రీష్ తెలుసుకోవాల‌ని సూచించారు. రాయ‌ల‌సీమ రైతులు అపోహ‌లు ప‌డుతున్నార‌ని ఆన‌క‌ట్ట ఎత్తు పెంచ‌డం వ‌ల్ల తెలంగాణ‌కు అద‌నంగా నీరు రావ‌ని కేవ‌లం క‌ట్ట మాత్రమే బలోపేతం అవుతుంద‌న్నారు.

ఆర్డీఎస్ కోసం తాము చేసిన ఉద్యమాల‌ను అవ‌మాన‌ప‌రిచే విధంగా కొంగ జపం, దొంగ జ‌పం అన‌డం ప‌ద్ధతి కాద‌ని ఎమ్మెల్యే సంప‌త్ కుమార్ అన్నారు. ఉద్యమాల‌ను అవ‌మాన‌ప‌రిస్తే ప్రజ‌ల నుంచి ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌వుతాయో నేత‌లు తెలుసుకోవాల‌ని సూచించారు. ఆర్డీఎస్ ప‌నుల విష‌యంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న చొరవ ఫ‌లితంగానే క‌ర్ణాట‌క ప్రభుత్వం స్పందించిందన్నారు. పాలమూరు జిల్లాకు ఒక్క టీఎంసీ నీరు విడుద‌ల చేసినందుకు సీఎం సిద్ధరామయ్యకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
 

Advertisement
Advertisement