స్పైస్‌ జెట్‌ చేసిన తప్పు..

23 Apr, 2017 11:50 IST|Sakshi
కూర్చునే జాతీయగీతం వినాల్సి వచ్చింది..

ఇండోర్‌: విమానాల్లోని ప్రయాణీకులంతా సీట్లలో కూర్చుని ఉండగానే స్పైస్‌ జెట్‌ విమానంలో జాతీయ గీతం వినాల్సి వచ్చింది. గీతం అంటే మర్యాద లేదని కాదుగానీ లేవలేని పరిస్థితి. దీంతో తమ సీట్లలో అలాగే స్థూలాకారంగా ఉండి జాతీయ గీతం వింటూ ఆలపించారు. ఇలాంటి పరిస్థితి కల్పించినందుకు సదరు ఎయిర్‌లైన్స్‌ సంస్థపై పునీత్‌ తివారీ అనే ఓ ప్రయాణీకుడు ఫిర్యాదు చేశాడు. అనూహ్యంగా జాతీయ గీతం వచ్చిందని, గౌరవార్థం లేచి నిల్చుందామంటే అందుకు తగిన పరిస్థితి లేకుండా పోయిందని, పైగా నిల్చోవద్దని ఆదేశించారని, అందుకు సదరు విమాన సంస్థే కారణం అంటూ అందులో పేర్కొన్నారు.

స్పైస్‌ జెట్‌కు చెందిన విమానం ఎస్‌జీ 1044  ఈ నెల (ఏప్రిల్‌) 18న తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వస్తూ ల్యాండ్‌ అయ్యే ముందు జాతీయ గీతాన్ని ప్లే చేసింది. కానీ, విమానంలోని సిబ్బందిగానీ, ప్రయాణీకులుగానీ లేవలేని పరిస్థితి ఏర్పడింది. అందుకు కారణం వారిని బంధించి ఉంచిన సీటు బెల్టులు. ‘ఓపక్క జాతీయ గీతం వస్తుండగా మమ్మల్ని సీట్లో నుంచి లేవోద్దంటూ పైలట్‌ ఆదేశించాడు. అతడి ఆదేశాలను మేం బలవంతంగా పాటించాల్సి వచ్చింది. పైగా జాతీయ గీతం వస్తుండగానే మధ్యలో ఒకసారి ఆపేసి కొద్దిసేపు ఆపి మళ్లీ ప్లే చేశారు’ అని ఆయన ఫిర్యాదు చేశాడు. అయితే, దీనిపై స్పైస్‌ జెట్‌ అధికారిక ప్రతినిధి వివరణ ఇస్తూ విమానంలో తమ సిబ్బంది పొరపాటువల్ల అనూహ్యంగా జాతీయ గీతం ప్లే అయిందని, అయితే, వెంటనే తాము ఆపేశామని, ఈ విషయంలో ప్రయాణీకులకు క్షమాపణలు చెబుతున్నామన్నారు.

మరిన్ని వార్తలు