ఒక యుద్ధం ముగిసింది.. మున్ముందు మరెన్నో

11 Oct, 2019 12:10 IST|Sakshi

ముంబై: పట్టణానికి చెందిన శ్రీదేవి మూడేళ్ల క్రితం సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ముంబై యూనివర్సిటీలో చేరిన శ్రీదేవి తనను తాను ట్రాన్స్‌జెండర్‌గా ప్రకటించుకున్న తొలి విద్యార్థిగా నిలిచారు. 2017లో యూనివర్సిటీలో బీఏ కోర్సులో చేరినప్పుడు శ్రీదేవి తనను ట్రాన్స్‌జెండర్‌గా ప్రకటించుకున్నారు. కష్టపడి చదివి యూనివర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ అండ్‌ ఒపెన్‌ లర్నింగ్‌(ఐడీఓఎల్‌) నుంచి సోషియాలజీ, సైకాలజీలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ.. గ్రాడ్యూయేషన్‌ పూర్తి చేయడమే ఓ యుద్ధం అనుకుంటే.. దాని తర్వాత ఉద్యోగం సంపాదించడం మరి కష్టమైంది అన్నారు.

‘చదువు పూర్తవ్వడంతో ఓ యుద్ధాన్ని జయించినట్లు భావించాను. ఇలాంటి యుద్ధాలు ముందు ముందు మరెన్నో చేయాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైంది ఉద్యోగం. చదవు పూర్తయ్యాక ఉద్యోగం సంపాదించడం మరింత కష్టమయ్యింది. ట్రాన్స్‌ఉమెన్‌కు జాబ్‌ ఇవ్వడానికి ఎవ్వరు ఆసక్తి చూపలేదు. ఎన్నో తిరస్కారాలు ఎదుర్కొన్న తర్వాత ఓ ఉద్యోగం లభించింది. ప్రసుత్తం నేను ఓ ఎలాక్ట్రానిక్‌ కంపెనీలో సీఏడీ డిజైనర్‌గా పని చేస్తున్నాను. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా నేను ఎదర్కొన్న అనుభవాల మేరకు భవిష్యత్తులో ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే బాగుంటుందనిపించింది. అయితే వ్యాపారం గురించి నాకు ఏం తెలియదు. కాకపోతే ఉద్యోగం కోసం ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు కదా. అందుకే వ్యాపారం చేయాలని భావిస్తున్నాను. ప్రస్తుతం ఉద్యోగంతో పాటు ఓ ఎన్జీవో అధ్వర్యంలో పిల్లలకు పాఠాలు చెబుతున్నాను. ఇంటిరీయర్‌ డిజైనింగ్‌కు సంబంధించి షార్ట్‌టర్మ్‌ కోర్సు కూడా చేస్తున్నాను’ అని తెలిపారు శ్రీదేవి.

ఇక తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ.. ‘నన్ను తమతో పాటు ఉంచుకోవడం అవమానంగా భావించేవారు నా తల్లిదండ్రులు. ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే.. వారికి కనిపించకుండా నన్ను గదిలో బంధించేవారు. తల్లిదండ్రుల ప్రవర్తన నన్ను ఎంతో బాధపెట్టిది. నేను మనిషిని.. నాకు ఓ మనసుంది.. నాకు జీవించే హక్కుంది. నేనేం తప్పు చేయలేదు. అలాంటప్పుడు నేనేందుకు దాక్కొవాలి అని నా మనసు తిరగబడేది. ఈ విషయం గురించి కుటుంబ సభ్యులతో ఎన్నో సార్లు గొడవ పడ్డాను. కానీ వారిలో మార్పు లేదు. దాంతో రెండేళ్ల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చాను. ఆనాటి నుంచి మరిక వెనుతిరిగి చూడలేదు’ అంటున్నారు శ్రీదేవి.

ఐటీఓఎల్‌ ప్రతినిధి వినోద్‌ మలాలే మాట్లాడుతూ.. మా యూనివర్సిటీలో ఎంతోమంది ట్రాన్స్‌జెండర్స్‌ ఉన్నారు. కానీ వారు ఎవరు తమను తాము ట్రాన్స్‌జెండర్స్‌గా ప్రకటించుకోలేదు. అలా చేసిన మొదటి విద్యార్థి శ్రీదేవి అని తెలిపారు.

మరిన్ని వార్తలు