సవరించినా... సగర్వంగా!

26 Jan, 2020 08:37 IST|Sakshi

ఎన్నెన్నో దాడులను తట్టుకున్న భారత రాజ్యాంగం

 వ్యవస్థల నడుమ ఘర్షణతో పలు మార్పులు

ఎన్ని జరిగినా పౌరుల రక్షణే మౌలిక తత్వం

 70 ఏళ్ల ప్రస్థానంలో నిలుపే... గెలుపు

డెబ్భై ఏళ్లు!. దాదాపుగా ఒక జీవితం!!. భారత రాజ్యాంగం ఒక జీవితాన్ని చూసింది. ఎన్నో దాడుల్ని తట్టుకుంది. కాలానికి తగ్గట్టుగా అని చెప్పలేం గానీ... ఈ కాలపు మనుషులకు తగ్గట్టు మారింది. కాకపోతే ఎన్ని దాడులు జరిగినా పౌరులకు రక్షణ కవచంలా నిలిచే తన అస్తిత్వాన్ని మాత్రం 70 ఏళ్లుగా కాపాడుకుంటూనే వచ్చింది. ఈ ప్రస్థానంలో కొన్ని రాజ్యాంగ హక్కులు పోయాయి. ప్రజాస్వామ్య నిర్మాణం మారింది. రాజ్యాంగ విలువల్ని కాపాడే పోరాటాలూ జరిగాయి. వీటన్నిటికీ కారణమైన సవరణలన్నీ రాజ్యాంగ రక్షణను పటిష్ఠం చేసేవని చెప్పలేం. వ్యక్తిగత హక్కుల్ని, రాజ్యాంగ రక్షణను కోర్టులు సమర్థించి ప్రభుత్వ ఎజెండాను కొట్టిపారేసినపుడు... రాజ్యాంగపరమైన ఆ అడ్డంకిని తొలగించడానికి పార్లమెంటు సవరణ మార్గాన్నెంచుకుంది. అంతే!!.
 
హక్కులన్నీ ఒకలాంటివి కావు..
రాజ్యాంగం వచ్చాక... ప్రభుత్వ విధానాలు కొన్ని రాజ్యాంగ విరుద్ధమయ్యాయి. క్రాస్‌రోడ్స్, ఆర్గనైజర్‌ పత్రికల్ని మద్రాసు, ఢిల్లీ ప్రభుత్వాలు నిషేధించాయి. కానీ 19(2)వ అధికరణం కింద çసుప్రీంకోర్టు వాటి భావ ప్రకటన హక్కును సమర్థించింది. దీనికి భిన్నమైనది జమీందారీ వ్యవహారం. కొన్ని రాష్ట్రాలు ధనిక జమీందార్ల భూముల్ని జనం కోసం తీసుకుని వారికి చాలా తక్కువ పరిహారాన్ని... ఇంకొందరికి పూర్తి పరిహారాన్ని ఇచ్చాయి. కొన్ని హైకోర్టులు దీన్ని రాజ్యాంగ విరుద్ధమన్నాయి. 14వ అధికరణం కింద అందరికీ సమాన రక్షణ ఉందని, వివక్ష తగదని చెప్పాయి. భూ సంస్కరణల ఎజెండాయే మూలబడిపోయింది. ఇదిగో... ప్రాథమిక హక్కులకు భంగం కలగకూడదని కోర్టులిలా నిర్దేశించినందుకు సవరణలతో పార్లమెంటు స్పందించింది. తొలి సవర ణలోనే... భావప్రకటన హక్కుకు ‘పబ్లిక్‌ ఆర్డర్‌’ అనే మినహాయింపును చేర్చింది. ఇక 14వ అధికరణం కల్పించిన సమాన రక్షణ సరికాదని సూచించింది జమీందారీ సమస్య ఫలితంగా... 9వ షెడ్యూలుగా పిలిచే 31బి అధికరణానికి పార్లమెంటు చోటిచ్చింది. ఈ 9వ షెడ్యూల్లో చేర్చిన ఏ చట్టమూ న్యాయ సమీక్ష పరిధిలోకి రాదు. చివరికది రాజ్యాంగానికి... ప్రాథమిక హక్కులకు విరుద్ధమైనా!. భూ సంస్కరణలకు సంబంధించి 13 చట్టాలతో ఆరంభమైన ఈ షెడ్యూల్లోకి  282 చట్టాల వరకూ వచ్చి చేరాయిప్పుడు.

ఉద్దేశమే ప్రధానం... కానీ..! 
నిజానికి తొలి సవరణే భావి గమనానికి నిర్దేశనం చేసింది. ‘ఉద్దేశం మంచిదైతే అడ్డంకులు తొలగించుకోవటానికి రాజ్యాంగ సవరణ చేయటం కరెక్టే’ అనే భావన వ్యక్తమయింది. దాంతో తరచూ... అంటే ప్రభుత్వ సామాజిక, సంక్షేమ అజెండాకు అడ్డం వచ్చినపుడల్లా  ప్రాథమిక హక్కుల్ని సవరిస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ గురించి కాస్త ఎక్కువ చెప్పుకోవాలి. ఆమె దూకుడుగా సోషలిస్టు అజెండా మొదలెట్టారు. దీన్లోని జాతీయీకరణ, గుత్తాధిపత్య నియంత్రణ, భూ సంస్కరణలు, భూ గరిష్ఠ పరిమితి, గ్రామీణ గృహ నిర్మాణాల్లో చాలావరకూ రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో ఉన్నవే. కానీ ప్రాథమిక హక్కులకు విరుద్ధమైనవి. దీంతో ప్రాథమిక హక్కుల ఆధిపత్యాన్ని పక్కనబెట్టే 25వ సవరణ రాజ్యాగంలో చేరింది. ప్రగతి దిశగా వేసే అడుగులకు రాజ్యాంగం అడ్డుకాకూడదని ఇందిర తరచూ చెప్పేవారు. అందుకే ఆమె హయాంలో 9వ షెడ్యూల్లో ఏకంగా 124 చట్టాలు వచ్చిచేరాయి. వీటిలో నాటి ప్రధాని తన లోక్‌సభ స్థానాన్ని పరిరక్షించుకోవటం కోసం చేసిన చట్టమూ ఉంది మరి!!. 

ఇందిర హయాంలో 3  ప్రధాన కేసులు
1) 1967: గోలక్‌నాథ్‌ కేసులో... ప్రాథమిక హక్కులను సవరించే విషయంలో పార్లమెంటు పాత్రను సుప్రీంకోర్టు పరిమితం చేసింది. దీనికి స్పందనగా 368వ అధికరణంలోని ప్రక్రియను సర్కారు సవరించి... తన అధికారాన్ని తిరిగి పొందింది.   
2) 1973: కేశవానంద భారతి కేసులో... పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించగలదు కానీ దాని మౌలిక నిర్మాణాన్ని మాత్రం మార్చజాలదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. అయితే ఆ మౌలిక నిర్మాణం ఏమిటన్నది నాటి న్యాయమూర్తి స్పష్టం చెయ్యలేదు. ఇది ఏ కేసుకు తగ్గట్టుగా అప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయమని వదిలిపెట్టారు.  
3) 1975: రాజ్‌ నారాయణ్‌ కేసులో... ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆమె దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఎన్నికల్ని, పౌర హక్కుల్ని సస్పెండ్‌ చేశారు. 1975 ఆగస్టులో 39వ సవరణ చేశారు. ఇది న్యాయ సమీక్ష పరిధి నుంచి ప్రధాన మంత్రి ఎన్నికను తప్పించింది. అలహాబాద్‌ హైకోర్టు తీర్పు చెల్లదనటమే కాదు... దానిపై అప్పీలును సుప్రీంకోర్టు పరిధి నుంచి కూడా తప్పించారు.  దీనికోసం 42వ సవరణ ద్వారా ఇందిర రాజ్యాంగాన్ని దాదాపుగా తిరగరాశారు.  పీఠికతో మొదలైన ఈ సవరణ.. భారత రిపబ్లిక్‌ ప్రాథమిక దృక్పథాలనూ మార్చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయాధికారాల్ని పరిమితం చేసి శాసన వ్యవస్థను అత్యున్నత స్థాయిలో నిలబెట్టింది. రాష్త్రపతి పాలన కాలాన్ని పొడిగిస్తూ ఫెడరలిజాన్ని నీరుగార్చింది. కాకపోతే వీటిలో చాలా అంశాల్ని మొరార్జీ దేశాయ్‌ హయాంలో యథా పూర్వ స్థితికి తెచ్చారు. కొన్ని మాత్రం మిగిలిపోయాయి.
 
రాజకీయాలు... రిజర్వేషన్లు 
1970లతో పోలిస్తే 1980ల్లో రాజ్యాంగంపై దాడులు తక్కువనే చెప్పాలి. 52వ సవరణ ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టం అమల్లోకి వచ్చింది. 73, 74వ సవరణలతో రాజ్యాంగ బద్ధమైన స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. 1992లో వీపీ సింగ్‌ ప్రభుత్వం ప్రభుత్వోద్యోగాల్లో ఓబీసీలకు 27 శాతం కోటాను కల్పించింది. అప్పటికే ఎస్సీ, ఎస్టీలకు 22.5 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. కాకపోతే.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించలేదు కనక ఇది చెల్లుతుందంటూ సుప్రీంకోర్టు సమర్థించింది. ఇటీవల మోదీ ప్రభుత్వం 103వ సవరణ ద్వారా ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఉద్యోగాల్లో మరో 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది.

సవరణల్లో న్యాయ స్థానాల పాత్ర... 
న్యాయవ్యవస్థ చెప్పే భాష్యాలు సైతం పలుమార్లు రాజ్యాంగాన్ని మార్చాయి. అయితే అవి అన్నివేళలా జనగళాన్నే వినిపించాయని చెప్పలేం. 124, 217 అధికరణలు వాటి స్వీయ ప్రయోజనాలు... అంటే న్యాయమూర్తుల నియామక ప్రక్రియకు సంబంధించినవి.  న్యాయవ్యవస్థను సంప్రతించి జడ్జీల్ని నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంది. 1993లో ఈ ‘సంప్రతించటం’ అనే మాటకు సర్వోన్నత న్యాయస్థానం మరో భాష్యం చెప్పింది. సీనియర్‌ న్యాయమూర్తులతో కొలీజియాన్ని ఏర్పాటు చేసింది. జడ్జిల నియామకంలో వీరి సిఫారసుల్ని రాష్ట్రపతి ఆమోదించి తీరాలి. 1998లో ప్రక్రియ పరమైన మార్పులు ప్రతిపాదించి.. జడ్జిల నియామకంలో ప్రజా ప్రతినిధుల్ని పూర్తిగా పక్కనబెట్టారు. అయితే కొలీజియం ప్రక్రియలో బంధుప్రీతి, గోప్యత, అవినీతికి తావులేకుండా మోదీ ప్రభుత్వం 99వ సవరణ తెచ్చింది. జాతీయ జ్యుడీషియల్‌ నియామకాల కమిషన్‌ను (ఎన్‌జేఏసీ) ఏర్పాటు చేసింది. దీన్లో ప్రజా ప్రతినిధులకు, ప్రముఖులకు స్థానమిచ్చారు. కానీ ఎన్‌జేఏసీ చట్టాన్ని, 99వ రాజ్యాంగ సవరణను రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి విరుద్ధమైనవిగా పేర్కొంటూ చెల్లవని సుప్రీంకోర్టు ప్రకటించింది. ప్రస్తుతం న్యాయమూర్తుల నియామకంలో న్యాయవ్యవస్థ లిఖించిన అవగాహనే అమల్లో ఉందని చెప్పాలి.  
ఇదిగో... ఇలాంటివన్నీ తట్టుకుని భారత రాజ్యాంగం నిలబడగలిగిందంటే అది భారతీయుల వల్లే. వారికి తాము రాజ్యాంగ బద్ధులమే తప్ప ప్రభుత్వాలకు బానిసలం కాదని బాగా తెలుసు!!.  

ఎన్నిరోజులు పట్టింది? 
భారత రాజ్యాంగం లిఖితం. దీని ముసాయిదా ప్రతులు రెండు భాషల్లో ఉన్నాయి. ఇంగ్లీషు, హిందీ. రాజ్యాంగాన్ని 22 భాగాలుగా విడగొట్టారు. 12 షెడ్యూల్స్‌... 444 ఆర్టికల్స్‌ ఉన్నాయి.  మొత్తం 283 మంది భారత రాజ్యాంగ సభ సభ్యులుగా ఉన్నారు.  ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగమయిన భారత రాజ్యాంగం పూర్తి చేయడానికి అంబేడ్కర్‌కీ, అతని బృందానికి  2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది... రమణమూర్తి మంథా

మరిన్ని వార్తలు