ఒక్క ఓటు, మూడు ఓట్లతో లక్కీవీరులు..

26 Jan, 2020 08:32 IST|Sakshi

నారాయణపేట 7వ వార్డులో ఒక్క ఓటుతో గెలుపు

వడ్డేపల్లి మున్సిపాలిటీలోని 7వ వార్డులో మూడు ఓట్లతో గెలుపు

సాక్షి, నారాయణపేట: ఎంతటి ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందన్న మాటను ఈ సంఘటన నిజం చేస్తున్నట్లుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో మొదటిసారి పోటీచేసి ప్రత్యర్థికన్నా ఒక్కటంటే ఒక్కటే ఓటు ఎక్కువ రావడంతో విజయం వరించింది. నారాయణపేట మున్సిపాలిటీలోని 7వ వార్డు నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి మహ్మద్‌సలీం సమీప అభ్యర్థి చలపతిపై ఒకే ఒక్క ఓటుతో విజయం సాధించి లక్కీ వీరుడుగా నిలిచారు.

బీజేపీ అభ్యర్థికి 310 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి మహ్మద్‌ సలీంకు 311ఓట్లు వచ్చాయి. ఒక ఓటుతో గెలుపొందారని అధికారులు వెల్లడించారు. బీజేపీ వారు పట్టుబట్టడంతో అధికారులు రీకౌంటింగ్‌ చేశారు. సలీంకు ఒక్క ఓటు అధికంగా రావడంతో ధ్రువీకరించి సరి్టఫికెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మహ్మద్‌సలీం మాట్లాడుతూ కౌన్సిలర్‌గా గెలవడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. దొంగఓట్లు వేయడాన్ని తాను అడ్డుకోవడం వల్లే గెలుపు సాధ్యమైందని చెప్పారు.

మూడు ఓట్లతో గెలుపు
శాంతినగర్‌ (అలంపూర్‌): వడ్డేపల్లి మున్సిపాలిటీలోని 7వ వార్డు అభ్యర్థి ఎన్‌.అజయ్‌కుమార్‌ మూడంటే.. మూడు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వేదవతికి 358 ఓట్లు రాగా.. అజయ్‌కుమార్‌కు 361ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వేదవతి ఓట్లు రీకౌంటింగ్‌ చేయాలని అధికారులను కోరింది. అభ్యర్థి కోరిక మేరకు రెండో పర్యాయం అధికారులు ఓట్లు లెక్కించారు. రెండోసారి లెక్కించినప్పటికి 3 ఓట్లు ఆధిక్యత లభించడంతో అజయ్‌కుమార్‌ను విజేతగా అధికారులు ప్రకటించారు.  

>
మరిన్ని వార్తలు