ఆ ఆన్సర్‌ షీట్లు చూసి టీచ‍ర్లు షాక్‌

19 May, 2018 15:31 IST|Sakshi

ఆగ్రా : పరీక్షలకు ముందు సరైన సన్నద్ధత లేక, సమాధాన పత్రాల్లో దేవుడి బొమ్మలు వేస్తూ.. దేవుడా మమ్మల్ని పాస్‌ చేయించూ అంటూ కోరుకోవడం సినిమాల్లో చూస్తుంటాం. అచ్చం సినిమాల్లో మాదిరే భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ విద్యార్థులు చేశారు. యూనివర్సిటీ విద్యార్థుల సమాధాన పత్రాలు చూసి పేపర్‌ మూల్యాంకన చేసే టీచర్లే షాకైపోయారు. వర్సిటీ 2017-18 సంవత్సరానికి సంబంధించిన మెయిన్‌ ఎగ్జామ్స్‌ సమాధాన పత్రాల్లో విద్యార్థులు హనుమాన్‌ భజన్లు, హారతి పాటలు రాశారు. భక్తి పాటలు, హారతి లైన్లతో విద్యార్థులు తమ సమాధాన పత్రాలను నింపేశారని పేపర్లు మూల్యాంకన చేసిన టీచర్లు పేర్కొన్నారు. ఒక విద్యార్థి అయితే ఏకంగా హారతి లైన్లకు అర్థం కూడా రాసినట్టు ఓ టీచర్‌ చెప్పారు. తన గర్ల్‌ఫ్రెండ్‌ తనని చదువుల్లో మంచి ప్రతిభ గల వాడిగా భావిస్తుందని, తనని పాస్‌ చేయాలని లేదంటే ఆమె తనని విడిచిపెడుతుందంటూ ఓ విద్యార్థి తన మనోవేదనను వెల్లబుచ్చాడు. ఇలా సమాధాన పత్రాల్లో వింత వింత జవాబులతో పేపర్లు దిద్దే టీచర్లకే చుక్కలు చూపించారు.  

కొన్ని కేసుల్లో 20 పేజీల సమాధాన పత్రాలను సినిమా స్క్రిఫ్ట్‌లు, కవితలు, పాస్‌ మార్కులు వేయాలంటూ అభ్యర్థనలు ఇవే కనిపించాయని, కొంతమంది విద్యార్థులైతే ఏకంగా టీచర్లను ప్రలోభపెట్టేందుకు కరెన్సీ నోట్లను కూడా ఆఫర్‌ చేసినట్టు ఓ సీనియర్‌ టీచర్‌ చెప్పారు.  వింత వింత సమాధానాలు రాసిన విద్యార్థుల తుది ఫలితాలు జూన్‌ 15న వర్సిటీ అధికారులు వెల్లడించనున్నారు. ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయకుండా.. ఇలాంటి సిల్లీ సిల్లీ అంశాలు రాసి పాస్‌ కావాలని విద్యార్థులు యోచిస్తున్నారని భీమ్‌ రావ్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ జీఎస్‌ శర్మ అన్నారు. ప్రతి రోజు టీచర్లు 5000కు పైగా సమాధాన పత్రాలను దిద్దుతారని వర్సిటీ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫైనల్‌ ఎగ్జామ్స్‌కు దాదాపు 5.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. 
 

>
మరిన్ని వార్తలు