‘కట్టా న్యూస్‌’తో ఎందుకు సంచలనం!

27 Nov, 2019 17:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన సంచలన పరిణామాలను అందరికన్నా ముందు ‘కట్టా న్యూస్‌’ వెల్లడించి సంచలనం సృష్టించింది. నవంబర్‌ 18వ తేదీన ఏర్పడిన ఈ ‘కట్టా న్యూస్‌’ 20వ తేదీన ఎన్‌సీపీ నుంచి అజిత్‌ పవార్‌ నాయకత్వాన ఓ వర్గం చీలిపోయి బీజేపీతో చేతులు కలపనుందని వార్తను వెల్లడించి తొలి సంచలనానికి శ్రీకారం చుట్టింది. అజిత్‌కు నచ్చచెప్పలేక పోతున్నానంటూ శరద్‌ పవార్‌ అసహనం వ్యక్తం చేసినట్లు కూడా ఆయన వెల్లడించారు. ఆ తర్వాత మూడు రోజులకు తెల్లవారుజామున దేవేంద్ర ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ సింగ్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంతో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరిందంటూ కట్టా న్యూస్‌ వార్తను ప్రచురించి మరో సంచలనం సృష్టించింది. 24వ తేదీన 70 వేల నీటి పారుదల కుంభకోణంలో అజిత్‌ పవార్‌కు ఏసీబీ క్లీన్‌ చిట్‌ ఇచ్చిందంటూ మరో ‘బ్రేకింగ్‌’ న్యూస్‌ ఇచ్చింది. ఈ మూడు పరిణామాలను వెల్లడించడంలో ప్రధాన మీడియా వెనకపడింది. ప్రధాన మీడియా నాడికి అందని రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకొచ్చిన ‘కట్టా న్యూస్‌’కు జేజేలు అంటూ ప్రముఖ రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు కట్టా న్యూస్‌ను నడుపుతున్న సీనియర్‌ జర్నలిస్ట్‌ సుధీర్‌ సూర్యవంశీకి అభినందనలు తెలిపారు.

కట్టా న్యూస్‌ ఎవరిది?
కట్టా న్యూస్‌ వెబ్‌సైట్‌ కాదు, వెబ్‌ పోర్టల్‌ అంతకంటే కాదు. ట్విటర్‌లో ఏర్పాటైన ఓ వేదిక. దీన్ని నిర్వహిస్తున్న సుధీర్‌ ట్వీట్ల ద్వారానే మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు తెలియజేశారు. ముంబైకి చెందిన ఆయన ఇంతకుముందు ఢిల్లీ నుంచి వెలువడే ‘డీఎన్‌ఏ’ పత్రికలో రిపోర్టర్‌గా పనిచేశారు. ఆ పత్రిక గత అక్టోబర్‌ నెలలో మూత పడడంతో ఆయన రోడ్డున పడ్డారు. పత్రికా జర్నలిజంలో 15 ఏళ్ల అనుభం కలిగిన సుధీర్‌ రాజకీయాలు, రియల్‌ ఎస్టేట్, వ్యవసాయం రంగాలకు సంబంధించి జీన్యూస్, ముంబై మిర్రర్‌కు వ్యాసాలు రాశారు.

ముకేశ్‌ అంబానీ తన ముంబైలోని ఆంటిలియా నివాసంలోకి అడుగుపెట్టిన మొదటి నెలలో ఆయన ఎలక్ట్రిసిటీ బిల్లు 70 లక్షల రూపాయలంటూ ఓ సంచలన వార్తను కూడా అప్పట్లో ఆయన రాశారు. డీఎన్‌ఏ మూతపడగానే సొంతంగా పోర్టల్‌గానీ, వెబ్‌సైట్‌గానీ ఏర్పాటు చేయాలని సుధీర్‌ భావించారు. ఆ ప్రయత్నాల్లో ఉండగానే మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతుండడంతో ‘కట్టా న్యూస్‌’ ఏర్పాటు చేశారట. కట్టా అంటే మరాఠీ భాషలో వార్తా విశేషాలు తెలుసుకునేందుకు ప్రజలంతా ఓ చోట గుమి కూడడం. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు వార్తలు తెలుసుకునేందుకు పంచాయతీ కార్యాలయాల ముందు గుమికూడేవారు.

అమ్ముడు పోయిన ప్రధాన మీడియా
నేడు ప్రధాన మీడియా రాజకీయ పార్టీలకు అమ్ముడు పోవడం వల్ల ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు చిన్న మీడియా ద్వారానైనా ప్రజలకు తనలాంటి వాళ్ల అవసరం ఉందని సుధీర్‌ ‘ఆల్ట్‌న్యూస్‌’తో వ్యాఖ్యానించారు. మహారాష్ట్రకు సంబంధించి ఆయన వెల్లడించిన పరిణామాలన్నీ బీజేపీకి సంబంధించినవే. ఉద్దేశ పూర్వకంగా ఎవరో ఆయనకు ఈ వార్తలను అందించి ఉంటారు. ఆయన నిజాయితీగా ఈ వార్తలను అందించినట్లయితే, నవంబర్‌ 22వ తేదీ అర్ధరాత్రి ప్రధాని నరేంద్ర మోదీ తన విశేషాధికారాలను ఉపయోగించి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ రాష్ట్రపతి భవన్‌కు ఉత్తర్వులు పంపడం, ఆ ఉత్తర్వులను స్వీకరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా, తక్షణమే ఉత్తర్వులను అమలు చేయాల్సిందిగా మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీకి అదే రోజు తెల్లవారు జామున పంపించడం, ఆయన ఆగమేఘాల మీద ఫడ్నవీస్‌ను పిలిపించడం లాంటి పరిణామాలను ఎప్పటికప్పుడు ఎందుకు తెలియజేయలేదు?!

మరిన్ని వార్తలు