స‌జ్జన్‌కు బెయిల్ నిరాక‌రించిన సుప్రీం

13 May, 2020 16:38 IST|Sakshi

న్యూఢిల్లీ: సిక్కు అల్ల‌ర్ల కేసులో యావ‌జ్జీవ జైలు శిక్ష అనుభ‌విస్తున్న కాంగ్రెస్ నాయ‌కుడు స‌జ్జ‌న్ కుమార్‌కు బుధ‌వారం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. ఆయ‌న కోరిన మ‌ధ్యంత‌ర బెయిల్ ఇచ్చేందుకు ధ‌ర్మాస‌నం నిరాక‌రించింది. స‌జ్జ‌న్ కుమార్ వైద్య కార‌ణాల రీత్యా మ‌ధ్యంత‌ర‌ బెయిల్ మంజూరు చేయాల‌ని ధ‌ర్మాసనాన్ని కోరాడు. ఈ నేప‌థ్యంలో అధికారులు అత‌నికి ఎయిమ్స్ వైద్యుల చేత ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అనంత‌రం వైద్య నివేదిక‌ను ప‌రిశీలించిన న్యాయ‌స్థానం అత‌న్ని ఆసుప‌త్రిలో చేర్పించాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంటూ బెయిల్ తిర‌స్క‌రించింది.  బెయిల్ ద‌‌ర‌ఖాస్తుపై విచార‌ణ‌ను జూలైకు వాయిదా వేసింది. ('సిక్కుల ఊచకోత జరిగేది కాదు')

సిక్కుల ఊచ‌కోత; దోషిగా స‌జ్జ‌న్‌
1984 అక్టోబ‌రు 31న అప్ప‌టి ప్ర‌ధాని ఇందిరాగాంధీని సిక్కులైన ఆమె వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా సిబ్బంది సత్వంత్‌ సింగ్, బియాంత్‌ సింగ్ కాల్చి చంపారు. ఆ మ‌రుస‌టి రోజే దేశ‌వ్యాప్తంగా సిక్కుల ఊచ‌కోత జ‌రిగింది.  ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ అల్లర్లలో దేశవ్యాప్తంగా 3,500 మంది సిక్కులు చనిపోగా, ఒక్క ఢిల్లీలోనే 2,800 మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు. ఇందులో ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని అతి దారుణంగా హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు నాయ‌కుల‌తోపాటు కాంగ్రెస్ నేత స‌జ్జ‌న్ కుమార్‌పైనా కేసు న‌మోదైంది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన ట్ర‌య‌ల్ కోర్టు స‌రైన సాక్ష్యాధారాలు లేక స‌జ్జ‌న్‌ను నిర్దోషిగా ప్ర‌క‌టించింది. దీంతో బాధితులు తీర్పును సవాలు చేస్తూ ఢిల్లీ కోర్టును ఆశ్ర‌యించారు. వీటిపై విచార‌ణ చేప‌ట్టిన ఢిల్లీ హైకోర్టు 34 ఏళ్ల త‌ర్వాత 2018 డిసెంబ‌ర్‌లో స‌జ్జ‌న్‌ను దోషిగా తేలుస్తూ జీవితకాల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ సజ్జ‌న్ సుప్రీంకోర్టులో స‌వాలు చేసిన విష‌యం తెలిసిందే‌. (కమల్‌నాథ్‌పై సిక్కు అల్లర్ల కేసు!)

>
మరిన్ని వార్తలు