15లోగా చెల్లించండి

3 Jul, 2014 22:39 IST|Sakshi
15లోగా చెల్లించండి

 న్యూఢిల్లీ/గుర్గావ్:జనవరి నుంచి జూన్ వరకూ పెండింగ్‌లో ఉన్న బకాయిలను ఈ నెల 15వ తేదీలోగా చెల్లించాలని బీఎస్‌ఈఎస్ యుమునా సంస్థను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. మే ఆరో తేదీన తాము ఇచ్చిన ఆదేశాలకు లోబడి విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలకు బకాయిలు చెల్లించాలని తన ఆదేశాల్లో అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. గత నెల 30వ తేదీవరకూ ఉన్న బకాయిలను బీఎస్‌ఈఎస్ యమునా సంస్థ చెల్లించాలని ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. బీఎస్‌ఈఎస్ సంస్థ అందజేసిన ఖాతాల తాలూకూ వివరాలపట్ల సంతృప్తి వ్యక్తంచేసింది. బీఎస్‌ఈఎస్ రాజధాని సంస్థ తన బకాయిలో 94 శాతం మేర చెల్లించిందని పేర్కొంది.
 
 ఈ కేసు తదుపరి విచారణను మరో రెండు నెలలపాటు వాయిదా వేసింది. కాగా బీఎస్‌ఈఎస్ రాజధాని సంస్థకు తూర్పు, మధ్య ఢిల్లీ పరిధిలో మొత్తం 13.5 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. చాందినీచౌక్, దర్యాగంజ్, పత ్పర్‌గంజ్, శంకర్‌రోడ్, పటేల్‌నగర్, కృష్ణానగర్, లక్ష్మీనగర్, మయూర్ విహార్ తదితర ప్రాంతాలకు ఈ సంస్థ విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. ఇక బీఎస్‌ఈఎస్ రాజధాని సంస్థ దక్షిణ, పశ్చిమఢిల్లీ పరిధిలోని అలకానంద, వసంత్‌కుంజ్, సాకేత్, నెహ్రూ ప్లేస్, నిజాముద్దీన్, సరితా విహార్, హౌజ్‌ఖాస్, ఆర్‌కేపురం, జనక్‌పురి, ద్వారకా తదితర ప్రాంతాలకు విద్యుత్‌ను సరఫరా చేస్తోంది.
 
 ఫేజ్‌త్రీ వాసులకు త్వరలో ఊరట
 గుర్గావ్‌లోని ఫేజ్‌త్రీ పరిసర వాసులకు శుభవార్త. విద్యుత్ సరఫరాలో కోతలనుంచి వీరికి త్వరలో విముక్తి కలగనుంది. ఇందుకు కారణం నాలుగు ఫీడర్లను దక్షిణ హర్యానా బిజిలీ వితరణ్ సంస్థ (డీహెచ్‌బీవీఎన్) త్వరలో ఫేజ్‌త్రీకి అనుసంధానం చేయనుండడమే. రింగ్ విధానంలో వీటిని కలపనుంది. ఇందువల్ల నాలుగు ఫీడర్లలో ఏదో ఒకదానిపై భారం పడితే దానిని మిగతా వాటికి బదిలీ చేయడానికి వీలవుతుంది. దీంతో ఏ ఒక్క ఫీడర్‌పైనా భారం పడే అవకాశమే ఉండదు. అయితే ఇదంతా సాకారమయ్యేందుకు కొంతకాలం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా ఫేజ్ త్రీలో కొంతకాలంగా విద్యుత్ సరఫరాలో కోత సర్వసాధారణంగా మారిన సంగతి విదితమే.
 

మరిన్ని వార్తలు