ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జితో విచారణ

12 Dec, 2019 02:27 IST|Sakshi

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ప్రతిపాదన

నేటికి విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: దిశ హత్యాచారం ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ప్రతిపాదించింది. బాధ్యులైన పోలీసు అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఘటనపై దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని, ఇదివరకే ఈ కోర్టు జారీచేసిన 16 మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలని న్యాయవాదులు జి.ఎస్‌.మణి, ప్రదీప్‌కుమార్‌ యాదవ్‌లు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం, ముకేశ్‌కుమార్‌ శర్మ దాఖలు చేసిన మరో ప్రజాహిత వ్యాజ్యం బుధవారం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వద్ద విచారించాల్సిన కేసుల జాబితాలో నమోదయ్యాయి. అయితే మధ్యాహ్న భోజన సమయంలో ఈ పిటిషన్లను సంబంధిత న్యాయవాదులు ప్రస్తావించగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ ఎ.బాబ్డే తొలుత స్పందిస్తూ.. ‘ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం మాకు తెలుసు.

ఘటనపై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపించేందుకు ఈ పిటిషన్‌ను అనుమతిస్తున్నాం. రిటైర్డ్‌ న్యాయమూర్తి ఇక్కడి (ఢిల్లీ) నుంచే దర్యాప్తు ప్రక్రియ చేపడతారు. రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ పీవీ రెడ్డిని ఈ విషయమై సంప్రదించాం. అయితే ఆయన సుముఖత చూపలేదు. ఈ విధి నిర్వహణకు మరో రిటైర్డ్‌ న్యాయమూర్తిని సంప్రదిస్తాం..’అని పేర్కొన్నారు. ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ‘పీయూసీఎల్‌ కేసులో 2014లో ఈ కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉత్తర్వులు జారీచేసే ముందు రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినాలి..’అని నివేదించారు. సలహాలు, సూచనలుంటే చెప్పొచ్చన్న ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదావేసింది. ఈ సందర్భంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో జస్టిస్‌ గోడా రఘురాం నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం ఎన్‌కౌంటర్లపై ఇచ్చిన తీర్పును కూడా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ ఎ.బాబ్డే ప్రస్తావించారు.   

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా