బహుభార్యత్వంపై విచారణకు సుప్రీం ఓకే

27 Mar, 2018 03:34 IST|Sakshi

న్యూఢిల్లీ: ముస్లింలు అనుసరిస్తున్న బహుభార్యత్వం, నిఖా హలాలాకు రాజ్యాంగబద్ధత ఉందా లేదా అన్న అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై తమ వైఖరి చెప్పాలంటూ కేంద్రం, లా కమిషన్‌లకు  నోటీçసులిచ్చింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం 2017లో ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేస్తూ బహుభార్యత్వం, నిఖా హలాలాపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రస్తుతం రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశాన్ని విచారణకు చేపట్టింది.

ఈ రెండు అంశాలపై మరో ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపడుతుందని పేర్కొంది. ఇస్లాం ప్రకారం ముస్లిం పురుషుడు నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చు. నిఖా హలాలాను అనుసరించి భర్త నుంచి విడాకులు పొందిన ముస్లిం మహిళ మళ్లీ అతడినే వివాహం చేసుకోరాదు. వేరే వ్యక్తిని పెళ్లాడి  అతనితో విడాకులు తీసుకున్నాకే మొదటి భర్తను పెళ్లాడేందుకు అనుమతిస్తారు. వీటిని వ్యతిరేకిస్తూ.. స్త్రీ, పురుషులకు సమన్యాయం కోరుతూ కేసువేశారు.
 

మరిన్ని వార్తలు