మమతా బెనర్జీకి సుప్రీం షాక్‌

10 May, 2018 15:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీం కోర్టు ఊహించని షాక్‌ ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవంపై సుప్రీం కోర్ట్‌ స్టే ఇచ్చింది. ఈ నెల (మే 14) 14న నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకూ ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీ ఫలితాలను జులై మూడు వరకూ ప్రకటించొద్దని అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల కమీషన్‌ను ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో తృణముల్‌కు గట్టి దెబ్బ తగిలిందని రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో 34 శాతం సీ​ట్లు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 58,692 పంచాయతీ స్థానాలకుగాను 20,000 పంచాయతీల్లో విపక్ష పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయకపోవడంతో ఆ స్థానాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయం సాధించినట్లయింది. రాష్ట్ర చరిత్రలో ఇంత మొత్తంలో సీట్లు ఏకగ్రీవం కావడం ఇదే తొలిసారి. గతంలో వామపక్ష పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 11 శాతం సీట్లు  ఏకగ్రీవంగా గెలుచుకుంది.

బెంగాల్‌ పంచాయతీ ఎన్నికలు మొదటి నుంచి వివాదాస్పదంగానే మారాయి. నామినేషన్‌ వేయకుండా అధికార టీఎంసీ ఇతర పార్టీ అభ్యర్థులను అడ్డుకుంటుందని విపక్షాలు కోల్‌కతా హైకోర్టును కూడా ఆశ్రయించాయి. దీనితో కోర్టు నామినేషన్లు గడవు ఒకరోజుకు పెంచింది. కొంత మంది అభ్యర్ధులు తమ నామినేషన్‌ పత్రాలను వాట్సాప్ ద్వారా పంపించడం, వాటిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించడం తెలిసిందే. అయితే ఎన్నికల కమీషన్‌ వాటిని తిరస్కరించింది.

మరిన్ని వార్తలు