వివాదాస్పద ట్వీట్‌ : బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులపై వేటు

19 Aug, 2019 13:23 IST|Sakshi

వేర్పాటువాద నాయకుడు (91) సయ్యద్ అలీషా గిలానీ  ట్వీట్‌ వివాదం నేపథ్యంలో  బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులపై  వేటు పడింది.  370 ఆర్టికల్‌ రద్దు అనంతరం తీవ్రమైన ఆంక్షల మధ్య, గిలానీ ట్వీట్‌ చేయడం కలకలం రేపింది.  దీనిపై విచారణ చేపట్టిన అధికారులు బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన ఇద్దరు అధికారులు గిలానీకి సహకరించినట్టుగా తేల్చారు.  దీంతో  ఇద్దరినీ  విధులనుంచి  సస్సెండ్‌ చేస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణ రద్దు అనంతరం కేంద్రం అక్కడ అన్నిరకాల సమాచార వ్వవస్థలను స్తంభింప చేసింది. ఆగస్టు 5న కేంద్రం  ఆర్టికల్‌ 370 రద్దును  ప్రకటించక ముందునుంచే (ఆగస్టు, 4) మొత్తం రాష్ట్రంలో ల్యాండ్‌లైన్‌లతో సహా, అన్ని కమ్యూనికేషన్ సౌకర్యాన్ని రద్దు చేసినప్పటీకీ,  అలీషా గీలానీ కొన్ని ట్వీట్లు చేయడం దుమారం రేపింది.  ఆగస్టు 8 ఉదయం వరకు ఆయనకు ల్యాండ్‌లైన్‌ ఫోన్‌, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఎలా అందుబాటులోకి వచ్చిందన్నది చర్చనీయాంశమైంది. ఆయన ట్వీట్లు రెచ్చగొట్టేవిగా ఉన్నాయంటూ  ట్విటర్‌ ఖాతాను నిలిపి వేసింది. కాగా 370, 35 ఏ అధికరణలు రద్దు అనంతరం కశ్మీర్‌లో అగ్ర రాజకీయ నాయకులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా సహా వందలాది మందిని గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు