292 రోజుల హాజరు తప్పనిసరి!

12 Apr, 2015 16:27 IST|Sakshi
292 రోజుల హాజరు తప్పనిసరి!

ఉద్యోగస్తులు ఏ చల్లటి దేశానికో.. సహారా ఎడారులకో పోవాలంటే అన్నింటికన్నా ముందు కావాల్సింది.. బాస్ పర్మిషన్! గ్రూప్ 4 నుంచి గ్రూప్ 1 సహా ప్రైవేటు ఉద్యోగులందరికీ ఈ రూల్ సహజమే! అయితే కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన నిబంధనల ప్రకారం గవర్నర్లు కూడా ఇకమీదట పర్మిషన్ దొరికితేగానీ వారు పనిచేస్తున్న రాష్ట్రం విడిచి వెళ్లడానికి వీల్లేదు! విదేశీయానమైనా.. స్వదేశంలోని మరో రాష్ట్రానికైనా.. ఎందుకు వెళుతున్నారో, ఎన్ని రోజులు పర్యటిస్తారో గౌరవ రాష్ట్రపతికి తప్పనిసరిగా చెప్పాల్సిందే. ఆయన ఓకే అంటే తప్ప కాలు కదపకూడదు!

ఇప్పటికే గవర్నర్ల తొలిగింపు, నియామకాల్లో ఇష్టారీతిగా వ్యవహరిస్తోందనే అపవాదును మూటగట్టుకున్న మోదీ సర్కార్ తాజాగా గవర్నర్ల  పర్యటనలపై ఆక్షలు విధించిడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 18 నిబంధనలతో కూడిన ఉత్తర్వులను జారీచేసింది, వాటి ప్రకారం గవర్లర్లు వారు పనిచేస్తోన్న రాష్ట్రాల్లో కనీసం 292 రోజులు ఉండాల్సిందే. స్వదేశంలోగానీ, విదేశాల్లోగానీ పర్యటించదల్చుకుంటే రాష్ట్రపతి భవన్ ఆమోదం ఉండాల్సిందే. పర్యటనకు ముందు గరిష్ఠంగా నాలుగు వారాల నుంచి ఒక వారంలోపు సమాచారం అందించాలి. కొన్నిసార్లు అత్యవసర పర్యటనలు చేయాల్సి వస్తుందికదా.. వాటికి కూడా రాష్ట్రపతి అనుమతిని తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంత కచ్చితంగా కాకున్నప్పటికీ గవర్నర్ కు సంబంధించి కొన్ని నిబంధనలు ఇప్పటికే ఉన్నాయి. అయితే కొందరు వాటిని ఉల్లంఘిస్తూ నెలల తరబడి తాము పనిచేస్తోన్న రాష్ట్రాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని హోంశాఖ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు