మణిపూర్‌లో పెద్దపార్టీ హస్తం

12 Mar, 2017 04:01 IST|Sakshi
మణిపూర్‌లో పెద్దపార్టీ హస్తం

అధికారానికి 3 స్థానాల దూరంలో కాంగ్రెస్‌.. బీజేపీ 21 సీట్లు
కీలకంగా మారిన చిన్న పార్టీలు
షర్మిలకు దారుణ పరాభవం


ఇంఫాల్‌: తుది నిమిషం వరకూ నువ్వానేనా అన్నట్లు సాగిన మణిపూర్‌లో ఓట్ల లెక్కింపు హంగ్‌కు దారితీసింది. 60 స్థానాలున్న అసెంబ్లీలో మేజిక్‌ఫిగర్‌ అయిన 31ని ఏ పార్టీ చేరలేదు. అధికార కాంగ్రెస్‌ 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. గత ఎన్నికల్లో ఒక్కసీటూ దక్కించుకోని బీజేపీ ఈసారి 21 సీట్లు సాధించి మెరుగైన ప్రదర్శన చేసింది. ఓట్ల శాతం పరంగా చూస్తే బీజేపీ కాంగ్రెస్‌ కన్నా ముందంజలో నిలిచింది. 59 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్‌ 35.1 శాతం, 60 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ 36.3 శాతం ఓట్లు సొంతం చేసుకున్నాయి.



గత ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకున్న ఎన్‌సీపీ ఈసారి ఖాతా తెరవలేదు. శనివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ఆధిక్యం కాంగ్రెస్, బీజేపీల చేతులు మారింది. ఇక ప్రభుత్వ ఏర్పాటులో చిన్నాచితకా పార్టీలు, ఒక స్వతంత్ర అభ్యర్థి కీలకం కానున్నారు. ది నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ) , ది నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌(ఎన్‌పీఎఫ్‌) చెరో నాలుగు స్థానాలు గెలుచుకున్నాయి. లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ), ఆలిండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ ఒక్కో సీటును కైవసం చేసుకున్నాయి. మరో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.  ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించేందుకు కాంగ్రెస్, బీజేపీలు చురుగ్గా పావులు కదుపుతున్నాయి. ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు సంప్రదింపులు, చర్చలు ప్రారంభించాయి.  ప్రభుత్వ ఏర్పాటుపై ఇరువర్గాలు ధీమా వ్యక్తం చేశాయి.



సారీ.. ఇరోమ్‌!!
మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోమ్‌ చాను షర్మిల గుర్తుందా..? ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే వర్తించే సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఏకంగా 16 ఏళ్ల పాటు నిరాహార దీక్ష చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన ధీర! పోలీసులు కొన్ని వందలసార్లు దీక్ష భగ్నం చేయడానికి యత్నించినా.. ప్రజల హక్కుల కోసం తన పోరాటం కొనసాగించారు.
ఏళ్ల తరబడి దీక్ష చేసినా ఫలితం లేకపోవడంతో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి పీఆర్‌జేఏ పార్టీ స్థాపించారు. ఈ ఎన్నికల్లో సీఎం ఇబోబిసింగ్‌పైనే పోటీచేశారు.
  ...అయితే ఆమెకు ఈ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? కేవలం 90!! దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆమె రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు!
ఎస్పీ నేత, యూపీ మంత్రి గాయత్రి ప్రజాపతి గుర్తున్నాడా? మహిళపై గ్యాంగ్‌రేప్‌ కేసులో నిందితుడు ఇతడు. ఇదే ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేశాడు. ఎన్నికల్లో ఓడిపోయినా.. ఆయనకు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? 50 వేల పైచిలుకు!!
...ప్రజాస్వామ్యంలో ఇదో విషాదం కాకపోతే మరేంటి??

మరిన్ని వార్తలు