ఆ విద్యార్థులు ప్రభుత్వ కాలేజీకి

31 Jan, 2016 03:47 IST|Sakshi

విద్యార్థినుల ఆత్మహత్యతో జయ ఆదేశం

 చెన్నై: ప్రైవేట్ మెడికల్ కళాశాల యాజమాన్యం వేధింపులకు తట్టుకోలేక ముగ్గురు వైద్య విద్యార్థినులు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన నేపథ్యంలో ఆ కళాశాలలో చదివే విద్యార్థులందరినీ ప్రభుత్వ కళాశాలకు తరలించాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శనివారం ఆదేశించారు. కేసు విచారణను సీబీ సీఐడీకి అప్పగించారు. ఫీజు వేధింపులను తట్టుకోలేక తమిళనాడులోని విల్లిపురం జిల్లాలో ఎస్‌వీఎస్ యోగా అండ్ నేచరోపతి కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే.

కళాశాల చైర్మన్ వాసుకీ సుబ్రమణ్యంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫీజు వేధింపులతో పాటు కాలేజీకి సంబంధించిన అనేక విషయాలు బయటపడుతున్నాయి. కాలేజీలో మౌ లిక సదుపాయాల కొరతతోపాటు కోర్సుల నిర్వహణకు సంబంధించి ఎంజీఆర్ మెడికల్ వర్సిటీ అనుమతి లభించలేదని తేలింది. తమను ప్రభుత్వ కళాశాలకు బదిలీ చేయడంతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుకంటే అధికంగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు