వాణిజ్య అద్దెగర్భంపై నిషేధం

25 Aug, 2016 07:52 IST|Sakshi
వాణిజ్య అద్దెగర్భంపై నిషేధం

- పెళ్లైన జంటలకు ఐదేళ్ల తర్వాత మాత్రమే సరోగసీ అవకాశం
- విదేశీయులు, భారత సంతతి, ఎన్నారైలకు ఎదురుదెబ్బ
- ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
 
 న్యూఢిల్లీ: పిల్లలు లేని దంపతులకు వరంగా మారిన సరోగసీ (అద్దెగర్భం) విధానాన్ని కొందరు  దుర్వినియోగం చేస్తుండడంతో ఈ విధానాన్ని పూర్తిగా నిషేధించే ముసాయిదా బిల్లుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న వారు మాత్రమే (వివాహమైన ఐదేళ్ల వరకు పిల్లలు పుట్టకుంటే) ఈ విధానం ద్వారా పిల్లలు పొందేందుకు వీలు కల్పించనున్నారు. సరోగసీ (నియంత్రణ) బిల్లు 2016ను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు అంగీకారం తెలిపింది. విదేశీయులు అక్రమంగా భారత్‌లో అద్దెగర్భం ద్వారా సంతానాన్ని పెంచుకోవటంతో.. వాణిజ్య సరోగసీకి భారత్ కేంద్రంగా మారిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు అమలయ్యాక అక్రమ చర్యలకు పాల్పడే వారికి పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 10 లక్షల జరిమానా విధించనున్నారు. సెలబ్రిటీలు, డబ్బున్న కుటుంబాల్లో సరోగసి ద్వారా పిల్లలను కనటం ఫ్యాషన్ (పురిటి నొప్పుల బాధపడకుండా) అయిపోయిందని సుష్మ విమర్శించారు. కేబినెట్ భేటీ తర్వాత కేబినెట్ నిర్ణయాలను మీడియాకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు.

 ఉగ్ర కాల్పుల్లో మరణించిన వారికి పరిహారం..
 జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల్లో చనిపోయే వారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం కారణంగా చనిపోయే వారికిచ్చే పరిహారాన్ని  5 లక్షలకు పెంచనుంది. ఈ తరహా దాడులు, ఘటనల్లో చనిపోయే వారికి నష్టపరిహారం మాత్రమే అందుతుందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వకూడదని  నిర్ణయించారు.

 ఇతర కేబినెట్ నిర్ణయాలు
 పన్ను ఎగవేతదారులపై ఉక్కుపాదం మోపే ప్రయత్నంలో భాగంగా.. భారత్, సైప్రస్ మధ్య డీటీఏఏ (డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్)కు కేంద్రం ఆమోదం తెలిపింది. భారత సమాచార సేవల (ఐఐఎస్) విభాగంలో గ్రూపు-ఏ కేడర్‌ను పునర్వ్యవస్థీకరించటంతోపాటు వివిధ దశల్లో అధికారుల నియామకానికి పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ మీడియా, కమ్యూనికేషన్ విభాగాన్ని మరింత పటిష్టం చేసేందుకే ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా 1,120 కిలోమీటర్ల జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధి కోసం రూ. 6,461 కోట్ల కేబినెట్ ఆమోదం తెలిపింది.
 
 బిల్లులో ముఖ్యాంశాలు
►పెళ్లై ఐదేళ్లు దాటిన జంటలకే అవకాశం
►భార్య వయసు 23-50 మధ్యలో..
►భర్త వయసు 26-55 మధ్యలో ఉండాలి.
►దంపతుల్లో ఒకరికి పిల్లలు కనేందుకు అవసరమైన సామర్థ్యం తక్కువగా ఉంది/లేదు అనే సర్టిఫికెట్ ఉండాల్సిందే.
►సంతానం లేని దంపతులకు మాత్రమే అద్దెగర్భం ద్వారా తల్లిదండ్రులయ్యే అవకాశం.
►అద్దెగర్భం ద్వారా పుట్టిన పిల్లలకు ఆస్తిపై సంపూర్ణ హక్కు
►గర్భాన్ని అద్దెకిచ్చే మహిళ కచ్చితంగా వివాహిత అయి ఉండాలి. అంతకుముందే.. ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి. ►కచ్చితంగా దంపతుల్లో ఒకరికి దగ్గరి బంధువై ఉండాలి.
►ఒకసారి మాత్రమే గర్భాన్ని అద్దెకు ఇచ్చేందుకు అనుమతి.
►ఈ విధానం ద్వారా పుట్టిన పిల్లలు అమ్మాయిలైనా, అంగవైకల్యంతో జన్మించినా వారికి భద్రత కలిపించేలా చట్టంలో మార్పులు.
►ఇతరులకు సాయం చేసేందుకు చేసే సరోగసికీ కొన్ని నియమాలతో అనుమతి.  సింగిల్ పేరెంట్స్, లివిన్ పార్ట్‌నర్స్ (పెళ్లికు ముందే కలిసుండే జంట), స్వలింగ సంపర్కులకు సరోగసీ ద్వారా పిల్లలు కనటంపై నిషేధం.
►విదేశీయులు, ఎన్నారైలు, పీఐవో (భారత సంతతి)లు, స్వలింగ సంపర్కులు, సహజీవనం చేసేవారిపై నిషేధం.  పేద మహిళలను ‘అద్దెగర్భం’ ఆశతో దోచుకోవటం నుంచి విముక్తి.

మరిన్ని వార్తలు